సాక్షి, ఖమ్మం : ‘కారు’లో కాక పుట్టింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీలు, ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలో చర్చకు దారి తీశాయి. తాజాగా శుక్రవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరగణం ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్‌లో సమావేశమైంది. పాలేరు నుంచే పోటీ చేసేలా తుమ్మలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గకేంద్రంగా రాజుకున్న రాజకీయ వేడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ రగులుతోంది. పార్టీ నుంచి టికెట్ వస్తే సరి.. లేకున్నా పోటీకి దిగడం ఖాయమని మాజీలు ఇస్తున్న సంకేతాలతో వారి అనుచర గణం, నేతల్లో జోష్ నెలకొంది. జిల్లాలో తుమ్మల, పొంగులేటి కలిసి పనిచేయాలని కోరుతున్న కేడర్... అధిష్టానం కూడా ఇద్దరికీ సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రచారంతో దూకుడు
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు దూకుడు పెంచారు. దీంతో వారి అనుచరగణం, కేడర్ కూడా ఇదే స్థాయిలో నియోజకవర్గాల్లో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా పక్షం రోజులుగా చోటు చేసుకుంటు న్న పరిణామాలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు ప్రభుత్వ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ముందుకెళ్తుండగా.. మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పరామర్శలు, సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ముందస్తు ఎన్ని కల వేడితో ఇప్పటి నుంచే పోటీకి సై అంటున్న వారంతా కార్యాచరణకు దిగడమే కాక పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఖాయమని అధిష్టానానికి సంకేతాలు పంపుతుండడం గమనార్హం.
చదవండి: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..
అసమ్మతి గళం
అధికార టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇటీవల తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు వ్యతిరేకంగా తుమ్మల, పొంగులేటి అనుచరులు సమావేశమైన విషయం విదితమే. మధిరలోనూ పొంగులేటి అనుచరగణం జెడ్పీ చైర్మన్, ఆయన కేడర్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటోంది. ఇక వైరా నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వర్గం ఎమ్మెల్యే రాములునాయక్ వర్గంతో కలవకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మె ల్యే, మాజీ ఎమ్మెల్యేకు తోడు పొంగులేటి వర్గం కూడా సై అంటే సై అంటుండడం గమనార్హం. ఇలా తమ నేతలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంకేతాలకు అనుగుణంగా కేడర్ క్షేత్రస్థాయిలో కదం తొక్కుతుండడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయో, లేదో తెలియకున్నా జిల్లాలో రాజకీయ వేడి మాత్రం మొదలైంది.
ముల్లు గుచ్చుకుంటున్నాయని..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌లో ఉన్న అసమ్మతి గళం ఇప్పుడిప్పుడే బహిరంగ వేదికలకు ఎక్కుతోంది. తిరుమలాయపాలెంలో తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోనే కాక రాష్ట్ర పార్టీలో కూడా చర్చ జరిగింది. ‘ముల్లు గుచ్చుకుంటున్నా ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున టికెట్ వచ్చినా, రాకున్నా ప్రజాతీర్పు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని ఆయన ప్రకటించారు. అంతేకాక ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తనతో సంప్రదింపులు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో పొంగులేటి తన దూకుడు పెంచారని రాజకీయంగా విశ్లేషణ జరుగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన ఆయనకు టికెట్ దక్కలేదని, ఈసారి తాడోపేడో తేల్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన అనుచర గణం కూడా చెబుతోంది. మొత్తంగా పాలేరు కేంద్రంగా పార్టీ అధిష్టానానికి పొంగులేటి తన నిర్ణయమేంటో చెప్పకనే చెప్పినందున ఇక పార్టీనే తేల్చుకోవాల్సి ఉంటుందని ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.
చదవండి: యూఎస్‌లో వీటికి చాలా డిమాండ్.. నువ్వు ఊ అంటే కోట్లే
సమాలోచనల్లో తుమ్మల వర్గం
మాజీ ఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరగణం ఖమ్మంలోని జూబ్లీక్లబ్‌లో సమావేశమైంది. పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొనగా, గత ఎన్నికల్లో పార్టీలోని నేతల కుట్రలతోనే తుమ్మల ఓడిపోయినందున ఈసారీ అక్కడి నుంచే పోటీ చేసేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని చర్చించుకున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మలకు టికెట్ ఇస్తారనే విశ్వాసం ఉందని చెబుతూనే, మరోవైపు టికెట్ రాకున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేలా ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పాలేరు ఎమ్మెల్యే కందాల వర్గం – తుమ్మల వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో తుమ్మల వర్గం తమ కార్యాచరణను నియోజకవర్గంలో వేగవంతం చేసింది. ఈమేరకు నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు యుగంధర్‌ను ఆహ్వానిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, పొంగులేటి, తుమ్మల ఇద్దరు కలిసి అడుగేస్తే జిల్లాలో పార్టీకి తిరుగుండదనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment