సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. (విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు? )
లాక్‌డౌన్ పురస్కరించుకుని కేసీఆర్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు అపహాస్యంగా మారాయని, మీడియా మొత్తం ఆయనకు అనుకూలంగా ఉందని భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బెదిరించి మీడియాను కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లో జరుగుతున్న లూటీకి బీజేపీ వ్యతిరేకమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. దీనిపై సీబీఐ, సీఐడీ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఇక ప్రతిపక్షాలను సీఎం ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైనది కాదని పేర్కొన్నారు. (సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్‌రావు)
Comments
Please login to add a commentAdd a comment