సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రచించారని... అందులో భాగంగానే ‘సారు’హెలికాప్టర్‌లో వచ్చి.. కాన్వాయ్‌లో డబ్బు సంచులు తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డితో కలసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికలో ఒక్కో ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైందన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించామంటూ సీఎం కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించడానికి యాదాద్రికి రమ్మన్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరినా, సీబీఐ విచారణకు డిమాండ్ చేసినా ముందుకు రాలేదని విమర్శించారు. తాము కోర్టును ఆశ్రయిస్తే విచారణ జరపొద్దంటూ కౌంటర్ వేస్తున్నారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటూ జీఓ 51ను జారీ చేసి ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆ జీఓ తీసుకొచ్చారని, సీబీఐ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు.
నలుగురితో ప్రభుత్వం పడిపోతుందా?
బీజేపీలో ఎవరు చేరినా పదవికి రాజీనామా చేసి రావాలనేది తమ విధానమని బండి సంజయ్ తెలిపారు. కానీ అధికార టీఆర్‌ఎస్ 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నా వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. వారందరికీ ఎంత డబ్బిచ్చి, ఏ ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారో చెప్పాలన్నారు. బీజేపీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు కొంటుందని, వారితో ప్రభుత్వం పడిపోతుందా? లేక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? తమకేం అవసరమని ప్రశ్నించారు.
చండూరు సభతో కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి కాబోతోందన్నారు. మునుగోడుకు సీఎం చేసిన మోసాలపై చార్జిషీట్ వేసేందుకు సిద్ధమా? అని బండి ప్రశ్నించారు. సీఎం కేసీఆరే జీఎస్టీ వేయాలని చెప్పారని, నూలు రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైందని, చేనేతబంధు ఏమైందని నిలదీశారు. ‘మోటార్లకు మీటర్లు పెట్టం.. అసలు నీ ఫాంహౌస్‌లోనే మీటర్లు పెడతం’అని ఆయన మండిపడ్డారు.
అధికారులకు బెదిరింపులు..
కేసీఆర్ పాలనలో పోలీసులు అల్లాడుతున్నారని, 317 జీఓతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని... మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించకపోతే వారిపై ఏసీబీ కేసులు పెట్టిస్తాం, బదిలీ చేస్తాం, లూప్‌లైన్‌లో వేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని చెబుతున్నారన్నారు.
యాదాద్రి కేటీఆర్ అయ్యదా? తాతదా? అని విమర్శించారు. టీఆర్‌ఎస్ చిల్లరగాళ్లకు కౌంటర్ ఇవ్వడానికి తామెందుకని అమిత్ షా, నడ్డా చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. మిగిలిన రెండు రోజులు మునుగోడు నియోజకవర్గంలో భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నామని, ఆ ర్యాలీలతో టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరుగుతుందని బండి సంజయ్ అన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పక్కాగా స్కెచ్చేశారు
Published Mon, Oct 31 2022 1:35 AM | Last Updated on Mon, Oct 31 2022 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment