యాదాద్రి ఆలయంలో స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తున్న సంజయ్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ తప్పుచేశారు కాబట్టే యాదాద్రికి రాలేదని, మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలందరూ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు.
శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ముఖమండపంలో ఉత్సవ విగ్రహాల వద్ద ఆయన ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం కొండ కింద స్వామివారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంజయ్ మాట్లాడారు.
ఆడియో టేపుల పేరుతో తాజాగా మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా.. చిత్తయిన డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు.
1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్
ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం.. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ అని, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్‌కుమార్ అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో దుకాణం నడవలేదని, హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడని, అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతున్నాడన్నారు. లిక్కర్ దందాలో తన బిడ్డను, అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదన్నారు.
తాను దేవుడిని నమ్ముకున్నానని, కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తరువాత టీఆర్‌ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపాడన్నారు.
తడి బట్టలతో ప్రమాణం
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పినట్లుగానే బండి సంజయ్ శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా ఆయన కొండపైకి చేరుకుని అక్కడే బిందెడు నీటితో తల స్నానం చేశారు. తడిబట్టలతోనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్లారు. గర్భాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద ప్రమాణం చేశారు. బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు నల్లజెండాలతో ఆందోళన చేశాయి. కాగా, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో చేనేత కార్మికులు పోస్ట్‌కార్డులు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment