సాక్షి ప్రతినిధి కర్నూలు : ఎంపీ అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను విశ్వభారతి ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. తల్లి వెంట అవినాశ్ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనతో పాటు పలు వురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆస్పత్రి నుంచి అవినాశ్ బయటకు రాగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు.
మరోవైపు.. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా ఎల్లో మీడియా శుక్రవారం ఉదయం నుంచి అవినాశ్ లక్ష్యంగా తప్పుడు కథనాలే ప్రసారం చేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాగానే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టుచేస్తారని బ్రేకింగ్‌లు, డిబేట్‌లు నిర్వహించింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిపై, ఆమె బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌పై కనీస మానవత్వం లేకుండా చికిత్సపై, అవినాశ్ అరెస్టుపై ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది.
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అవినాశ్ అక్కడ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది. గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావడంతో తదుపరి చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. అమ్మను పరామర్శించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీడియాకు ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే మనసులో పెట్టుకోవద్దు’.. అని ఆయన చెప్పారు.
చేరిక నుంచి డిశ్చార్జ్ వరకూ తప్పుడు కథనాలే!
అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మిని చూసేందుకు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి అవినాశ్ పులివెందులకు బయల్దేరారు. పుల్లూరు టోల్‌గేట్ వద్ద సీబీఐ అధికారులు ఉన్నారని, అవినాశ్‌ను అరెస్టుచేయబోతున్నారని ‘పచ్చ’ చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ రోజు సీబీఐ అధికారులే రాలేదు. 20న కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారని ప్రచారం చేశారు.
22న సీబీఐ అధికారులు ఎస్పీని కలిశారని.. ఇక్కడి పోలీసుల సహకారం లేకపోవడంతో మధ్యాహ్నానికి కేంద్ర బలగాలు రానున్నాయని, కాసేపట్లో కర్నూలుకు చేరుకుంటాయని, అవినాశ్ అరెస్టు తప్పదని రోజంతా ఏబీఎన్, టీవీ5లో గంటల తరబడి డిబేట్లు నడిపించారు. కానీ, కేంద్ర బలగాలు కర్నూలుకు రాలేదు. అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ‘ఈరోజు అరెస్టు తప్పదు’ అనే కోణంలోనే ప్రసారం చేశారు.
చివరకు శ్రీలక్ష్మి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వభారతి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలులో రహస్య ప్రాంతాల్లో ఉన్నారని, డిశ్చార్జ్ కాగానే అరెస్టుచేస్తారని కథనాలు ప్రసారం చేశారు. ఇలా వారం రోజులుగా ఎల్లో మీడియా చెప్పిన ఏ ఒక్కటి జరగలేదు. ఒక్క వార్తలోనూ వాస్తవంలేదు. దీంతో ఎల్లో మీడియా అవినాశ్ లక్ష్యంగా ఎలాంటి తప్పుడు వార్తలు రాసిందో ప్రజలకు స్పష్టమైంది.
శ్రీలక్ష్మి ఆరోగ్యంపైనా తప్పుడు వార్తలే..
పులివెందులలో శ్రీలక్ష్మి ఇంట్లో బీపీ వచ్చి పడిపోవడంతో ఉన్నత వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలులో విశ్వభారతి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్‌లో మార్పులు వచ్చాయని, ఈసీజీ తీశామని, రెండు రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యాయని డాక్టర్ హితేశ్‌రెడ్డి మీడియాకు చెప్పారు.
కానీ, శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగానే ఉందని, సీబీఐ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తల్లిని పావుగా చేసుకున్నారనే కోణంలో కనీస మానవత్వం లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. టీడీపీ వ్యక్తులు, మద్దతుదారులతో డిబేట్లు నడిపించారు. చివరకు.. ఆవిడకు బీపీ ఎక్కువై అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని వైద్యులు చెప్పినా తప్పుడు వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు.
బుధవారం రాత్రి నుంచి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగవుతూ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. రెండు రక్తనాశాలు బ్లాక్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో పచ్చ చానళ్ల ప్రసారాల్లో ఏమాత్రం నిజంలేదని అందరికీ తేటతెల్లమైంది.
Comments
Please login to add a commentAdd a comment