దుష్ర్పచారాలను ఖండిస్తూ కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మి ఆరోగ్యం విషమంగానే ఉంది. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యుల బృందం క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఎంపీ అవినాశ్ నిరంతరం అక్కడే ఉంటూ తల్లి బాగోగులు ఎప్పటికప్పుడు స్వయంగా చూసుకుంటున్నారు. వారిని పరామర్శించేందుకు రాయలసీమ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఎంపీ అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేస్తోందంటూ తప్పుడు వార్తలకు తెర తీసిన ఎల్లో మీడియా తన విష ప్రచారాన్ని కొనసాగిస్తోంది. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు బులెటిన్ విడుదల చేయడం, ఓ వర్గం మీడియా తప్పుడు వార్తల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే సోమవారం రాత్రంతా గడిపారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా బలగాలను తరలించారు.
సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లారంటూ..
పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఉంటున్న సీబీఐ అధికారులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి మాత్రమే వెళ్లారు. అయితే ఎల్లో మీడియా మాత్రం సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రిలోకి వెళ్లారని, అక్కడ పరిస్థితి, శ్రీలక్ష్మి ఆరోగ్యం గురించి వాకబు చేశారని దుష్ప్రచారం చేస్తూ డిబేట్లు నిర్వహించింది. విశ్వభారతి ప్రాంగణం, గాయత్రి ఎస్టేట్‌లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెదరగొట్టి ఉద్రిక్తతకు దారితీసేలా కథనాలు ప్రసారం చేసింది.
రోప్ పార్టీ పోలీసులు భోజనం చేసేందుకు వెళుతుంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారిపై ఆందోళనకు దిగినట్లు ఎల్లో మీడియా తప్పుడు వార్తలకు తెగబడింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మంగళవారం సాయంత్రం వరకూ అంతా ప్రశాంతంగా ఉండటంతో ఇక రాత్రికి అవినాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మళ్లీ ప్రచారానికి
తెరతీసింది.
శాంతియుతంగా నిరసన..
శ్రీలక్ష్మి, అవినాశ్‌ను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్, మేయర్లు సురేశ్‌బాబు, బీవై రామయ్య కడప, కర్నూలు కార్పొరేషన్ల కార్పొరేటర్లు ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, ఆర్థర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు ఆస్పత్రి వద్దే ఉంటున్నారు.
ఎల్లో మీడియా దుష్ప్రచారాలను నిరసిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మంగళవారం రాత్రి 7 గంటలకు ఆస్పత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. తన తల్లి ఆరోగ్యం కుదుట పడగానే 27 తర్వాత తానే స్వయంగా వస్తానని ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రకటించారని, మానవత్వంతో వ్యవహరించాలని సీబీఐ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment