హైదరాబాద్: అవినాష్‌రెడ్డిని ఈ నెల 31 వరకు (బుధవారం) అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సిబిఐకి సూచించింది. ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ సూచనలు చేసింది. 31న తుది ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు ఎలాంటి కఠిన చర్య తీసుకోవద్దని సూచించింది.
నిన్నటికి కొనసాగింపుగా ఇవ్వాళ కూడా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు సుదీర్ఘ విచారణ జరిగింది. నిన్న అవినాష్ రెడ్డి, సునీత వాదనలు పూర్తి కాగా, ఇవ్వాళ సీబీఐ తరఫు న్యాయవాది ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా CBI SP వికాస్ సింగ్, ASP ముఖేష్ శర్మతో పాటు సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టు హాల్ కు వచ్చారు.
కేసు దర్యాప్తులో అవినాష్ రెడ్డి ఆటంకాలు కలిగిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని సిబిఐ లాయర్ అనిల్ ఆరోపించారు. హత్యకు రాజకీయ కారణాలున్నాయని తెలిపింది. దీనిపై హైకోర్టు వెకేషన్ బెంచ్ కొన్ని ప్రశ్నలు అడిగింది.
మీ పద్ధతి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా?
అవినాష్‌రెడ్డిపై ఏ ఆధారాల మేరకు అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. దానికి కొందరు సాక్షుల వాంగ్మూలాల మేరకేనని సిబిఐ తెలిపింది. ఒక సీల్డ్ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సాక్షుల వాంగ్మూలాల వివరాలను పిటిషనర్ అయిన అవినాష్ రెడ్డికి కూడా ఇస్తారా అని ప్రశ్నించింది. దీనిపై సిబిఐ వివరణ ఇచ్చింది. సాక్షుల వివరాలను కేవలం కోర్టుకు మాత్రమే ఇస్తామని, ప్రస్తుత దశలో బయటపెట్టలేమని తెలిపింది.
సిబిఐ స్పందనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాలపై అవినాష్ రెడ్డి వాదనలు వినకుండా ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? వాటిని కోర్టు ఎలా పరిగణించాలి అని ప్రశ్నించింది. ఏ కేసులోనయినా,.. ఏ ఆధారంపైనయినా.. ఇరుపక్షాల వాదనలు వినాలని సూచించింది. సిబిఐ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది.
అ అవసరం అవినాష్‌కు ఏముంది?
‘అవినాష్ ఇంట్లో ఎ-2 నిందితుడు ఉన్నారని ఎలా చెబుతున్నారు?, ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైంది? లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు? లోక్‌సభ అభ్యర్ధిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ చార్జ్‌షీట్‌లో చాలామంది స్టేట్‌మెంట్‌లు ఉన్నాయి కదా? అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్‌మెంట్లు ఉన్నాయి కదా?, అవినాష్ చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారు.
అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా?, వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముంది?. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి అరెస్ట్‌కు కారణాలేంటి?. కస్టడీలో వారిద్దరి నుంచి ఏం తెలుసుకున్నారు?’ అని సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
దీనిపై రిప్లై వాదనల్లో తమ వాదన వినిపించారు అవినాష్ తరపు న్యాయవాది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఓటర్లు ఓట్లు వేయకపోవడం వల్లే వివేకా ఓడిపోయారు తప్ప.. దాన్ని అవినాష్ కు ఎలా అంటగడతారని ప్రశ్నించారు.
అది ఎవిడెన్స్ ట్యాంపర్ ఎలా అవుతుంది?
‘గదిలో రక్తం మరకలు తుడిచేస్తే ఏమవుతుంది.. శరీరంపై గాయాలు ఉంటాయి కదా? ఒక లీడర్ హత్య జరిగిందంటే ప్రజలు ఊరుకుంటారా? వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా?, హత్య అని తెలుస్తున్నప్పుడు గదిలో రక్తపు మరకలతో అవసరం ఏముంది?’, అని సీబీఐ న్యాయవాదికి ప్రశ్నలు సంధించింది హైకోర్టు.
గంగిరెడ్డిని whatsapp చాట్ గురించి అడిగారా?
వాట్సాప్ ద్వారా అవినాష్ సంభాషించాడంటూ సిబిఐ చేసిన వాదనలపై హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది.
- అవినాష్ డేటా వినియోగించాడంటున్నారు.. అది వాట్సాప్ కాల్ అని ఎలా చెప్పగలరు?
- ఒక వేళ అవినాష్ వాట్సాప్ కాల్ చేశాడని చెబుతున్నారు? ఎవరెవరితో మాట్లాడారు?
- అవినాష్ IPDR డాటా ఎప్పుడు సేకరించారు?
- అవినాష్ డాటా తీసుకున్నప్పుడు.. ఇతర నిందితుల వాట్సాప్ డేటా కూడా తీసుకున్నారా?
- A1 ఉన్న గంగిరెడ్డిని వాట్సాప్ చాట్ గురించి అడిగారా? అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది
దీనికి సీబీఐ సమాధానం చెబుతూ.. విచారణలో అవినాష్‌తో చాట్ చేయలేదని గంగిరెడ్డి చెప్పాడని తెలిపింది. మరి తెల్లవారుజామున అవినాష్‌రెడ్డి ఎవరితో చాట్ చేశారు’ అని హైకోర్టు అడగ్గా.. వాట్సాప్ కాల్ చేసినట్లు మాత్రమే భావిస్తున్నామని సీబీఐ తెలిపింది. వాట్సాప్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేమని స్పష్టం చేసింది. మరి అవినాష్ వాట్సాప్ లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్పాప్ బిజిగా ఉందా? అని ప్రశ్నించింది హైకోర్టు.
ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?
కేసు దర్యాప్తు విషయంలో CBI తీరును ప్రశ్నించింది హైకోర్టు. అసలు అవినాష్ రెడ్డి డేటాను ఎప్పుడు సేకరించారని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ నెల 12నే సేకరించామని తెలిపింది. CBI సమాధానంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వివేకా హత్య వెనక భారీ కుట్ర జరిగిందని, అందులో అవినాష్ పాత్ర ఉన్నట్టు ఎప్పటినుంచో అనుమానిస్తున్నామని చెబుతున్న CBI దర్యాప్తులో ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్టని హైకోర్టు ప్రశ్నించింది. హత్య జరిగి ఇన్నాళ్లయిన తర్వాత అవినాష్ పాత్ర కోసం CBI చేస్తున్న ప్రయత్నంపై అసహనం వ్యక్తం చేసింది. నిజంగా మీకు ముందు నుంచే అనుమానం ఉండి ఉంటే.. అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? అని నిలదీసింది హైకోర్టు. వివేక హత్య జరిగిన కరెక్ట్ సమయం చెప్పమని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా, మే 15 తెల్లవారు జామున 1:10 గంటల నుంచి 1:30 గంటల మధ్య వివేక హత్య జరిగినట్లు భావిస్తున్నామని సీబీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment