సాక్షి ప్రతినిధి కర్నూలు, పులివెందుల: ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మికి ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయారు.
దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్‌రెడ్డి పర్యవేక్షణలో శ్రీలక్ష్మికి చికిత్స అందిస్తున్నారు.
రక్త పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు.
మానవత్వం లేకుండా వెంటాడిన వైనం
శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని నివాసం నుంచి బయల్దేరిన ఎంపీ అవినాశ్‌రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం గురించి తెలియడంతో దర్యాప్తు అధికారులకు న్యాయవాది ద్వారా సమాచారం అందచేసి హుటాహుటిన ప్రయాణమయ్యారు. అవినాశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద నిరీక్షిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది.
ఎల్లో మీడియా ప్రతినిధులు చెక్‌పోస్టు వద్దే కాపుకాసి అవినాశ్ కాన్వాయ్‌ను వెంటాడారు. మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో అవినాశ్ చెక్‌పోస్టు దాటి పులివెందుల మార్గంలో వెళ్లారు. అనంతరం తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్ద అంబులెన్స్‌లో తల్లిని చూసి అవినాశ్ కంటతడి పెట్టారు. పులివెందుల వెళ్లకుండా తిరిగి తల్లితో పాటు హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే శ్రీలక్ష్మి పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెర తీసింది. శ్రీలక్ష్మి ఆరోగ్యంగానే ఉన్నారని, సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ ప్రయత్నిస్తున్నారంటూ మానవత్వం లేకుండా చానళ్లలో చర్చలు నిర్వహించింది.
పరిస్థితి ఆందోళనకరం
శ్రీలక్ష్మి అనారోగ్యంపై భిన్న కథనాల నేపథ్యంలో విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణుడు హితేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఛాతీలో నొప్పి వచ్చి శ్రీలక్ష్మి కిందపడిపోయారు. లో బీపీ అని భావించి పులివెందుల ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత కర్నూలు తీసుకొచ్చారు. ఈసీజీ చేస్తే మార్పులు కనిపించాయి. కొన్ని పరీక్షలు చేశాం. రిపోర్టులు రాలేదు. కార్డియాక్ ఎంజైమ్స్‌లో మార్పులు వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆందోళనకర పరిస్థితి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఎంజైమ్స్ పెరుగుతూ ఉన్నందున ప్రతి రెండు గంటలకు ఒకసారి పరీక్షలు చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’ అని పేర్కొన్నారు.
చదవండి: ‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’
Comments
Please login to add a commentAdd a comment