పర్యావరణ పరిరక్షణకు కృషి
Published Sun, Jul 24 2016 7:21 PM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
యూజీసీ విశ్రాంత వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.దేవరాజ్ పిలుపు
విజ్ఞాన్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ స్థాయి సదస్సు
చేబ్రోలు: పర్యావరణ పరిరక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని యూజీసీ విశ్రాంత వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్ దేవరాజ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘లీడర్‌షిప్ ఫర్ ససై్టనబుల్ ఫ్యూచర్స్ ఇన్ సోషియో ఎకొలాజికల్ సిస్టమ్స్’ (సామాజిక పర్యావరణ వ్యవస్థల్లో నాయకత్వ పెంపుదల) అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో సహకారంతో విజ్ఞాన్ విశ్వవిద్యాలయ బయో టెక్నాలజీ, ఐటీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 17 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. దేవరాజ్ మాట్లాడుతూ గూగుల్ సెర్చి ఇంజిన్‌లో అన్నీ దొరుకుతాయిగానీ, విద్యార్థికి సరైన నడవడికను నేర్పలేదని చెప్పారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సీనియర్ సలహాదారు టీఎస్ రావు మాట్లాడుతూ పర్యావరణ చక్రాల స్థిరీకరణపై విద్యార్థులు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన ప్రొఫెసర్ ఒకాయ్ బోష్, టీసీఎస్ సంస్థ ఉపాధ్యక్షుడు ఎంజీపీఎల్ నారాయణ, టీసీఎస్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త జోస్‌కుమార్‌రెడ్డి, టీసీఎస్ లాంగ్వేజ్ మేటర్స్ ప్రతినిధి, శ్రీలంకు చెందిన డాక్టర్ లియోనీ సోలోమన్, పాండిచ్చేరికి చెందిన మదర్స్ సర్వీస్ సొసైటీ ప్రతినిధి ఆచార్య గ్యారీ జాకోబ్స్, కొలంబియాకు చెందిన డాక్టర్ క్లెమెన్సియా మొరాలెస్, అమెరికాకు చెందిన హమీద్ ఖాన్, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్ నామ్, అమెరికాకు చెందిన పుజెట్ సౌండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రియాస్ ఉడ్‌బే తదితరులు పాల్గొని గ్రీన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎకో ఇన్ఫర్మాటిక్స్ దాని అనుబంధ అంశాల్లో సెన్సార్ల వినియోగం, ఫైలోజియోగ్రఫీ, వ్యవసాయం, పశుపోషణ తదితర అంశాలు, వాటి అభివృద్ధికి వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించారు. పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రదర్శన లాంటి సాంకేతిక విధానం ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా 500 మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ సీడీని ఆవిష్కరించారు. చాన్సలర్ రామ్మూర్తినాయుడు, వీసీ సీ తంగరాజ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement