నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం కుర్రోడు మేడిది జాన్ విలియమ్ కేరీ అద్భుత పరిశోధన చేశాడు. మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా కలిగే చలనాలను గుర్తించే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేశాడు. ఇతను చేసిన పరిశోధనలకుగాను గుంటూరు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ లభించింది. పలువురు ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్న విలియమ్.. తాను రూపొందించిన పరికరానికి పేటెంట్ కోసం దరఖాస్తు కూడా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ చదివిన విలియమ్ పీహెచ్‌డీ పరిశోధనలో అరుదైన అంశాన్ని ఎంచుకున్నాడు.
మూర్చ, పక్షవాతం, తలనొప్పి, కోమాలోకి వెళ్లడం లాంటి సందర్భాల్లో రోగికి సహజంగా ఎంఆర్‌ఐ, ఎలక్ట్రోయన్సీ ఫెలోగ్రామ్(ఈఈజీ) లాంటి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా చలనాలను గుర్తిస్తారు. అయితే ఈ చలనాలను కొన్ని సందర్భాల్లో వైద్యులు వేరే విధంగా అర్థం చేసుకోవడం, ఈ కదలికలు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక, అవికూడా రోగానికి సంబంధించిన లక్షణాలుగా పొరపాటుపడే ప్రమాదముందని విలియమ్ చెప్పాడు. పరీక్ష సమయంలో నాడుల కదలికలు సహజంగానే ఉంటాయని, వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదని విలియమ్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఈ కదలికలను గుర్తించడానికి ఓ పరికరాన్ని తయారు చేశాడు.
పరికరం పని చేస్తుందిలా...: కేవలం రూ. 3 వేలు మాత్రమే ఖర్చయ్యే ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు అనుసంధానం చేయ డం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విలియమ్ చెబుతున్నాడు. పరికరం రూపొందించిన విధానం, పనిచేసే పద్ధతి గురిం చి విలియమ్ వివరిస్తూ... ‘సాధారణంగా మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఈఈజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంలో రోగి కనురెప్పలు మూసి తెరిచినా, కనుగుడ్లు పక్కకు కదిపినా కూడా మెదడులోని నాడుల్లో చలనాలు కలుగుతాయి. అవి రోగం తాలూకా చలనాలా? లేక సాధారణ చలనాలా? అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్లు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది వైద్యులకు, రోగులకూ కూడా ఇబ్బందే. కొన్ని సందర్బాల్లో వైద్యులు పొరపాటుపడి ట్రీట్‌మెంట్ కూడా చేస్తారు.
మెదడులో కలిగే ఈ చలనాలను గుర్తించడానికే ఈ ఆటోమేటిక్ ఐబ్లింక్ డిటెక్టర్ యూజింగ్ మైరియో పరికరాన్ని రూపొందించాను. ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు జతచేస్తే, రోగానికి సంబంధం లేకుండా మెదడులో కలిగే చలనాలను పరీక్ష సమయంలోనే గుర్తించి తెలియజేస్తుంది. దీంతో వైద్యుడికి పదేపదే పరీక్ష చేసే అవసరం ఉండదు. లాబ్ వ్యూసాప్ట్‌వేర్ కోడ్‌ను డెవలప్‌చేసి, మైరియో ప్రాసెసర్ ద్వారా ఈ పరికరం తయారు చేశాను. బయో పొటెన్షియల్ యాంప్లిఫైర్లు, ఎలక్ట్రోడ్స్‌ను ఉపయోగించి సింపుల్‌గా పరికరం తయారు చేశాను. పరికరం తయారీకి రూ.3 వేలు మించి ఖర్చు అవ్వదని, కానీ ఉపయోగం మాత్రం ఎక్కువగా ఉంటుంద’న్నాడు.
Comments
Please login to add a commentAdd a comment