పుష్పోత్సవం..మల్లన్న వైభవం
పుష్పోత్సవం..మల్లన్న వైభవం
Published Mon, Feb 27 2017 10:36 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం పుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల యాగాలకు ఆదివారం పూర్ణాహుతి జరిగిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణచేసి ఉత్సవాలకు ముగింపు పలికారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో మహాశివ రాత్రిన వధూవరులైన స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాత్రి 8.30 గంటలకు అశ్వవాహనంపై అధిష్టింపజేసి విశేష వాహనపూజలను అర్చకులు, వేదపండితలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయంలోనే ఊరేగించారు.
స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ వేడుకల కోసం పరిమళభరితమైన పుష్పాలతో అలంకార మండపాన్ని తీర్చిదిద్దారు. రాత్రి 9.30గంటల తరువాత ఆదిదంపతులకు వేదమంత్రోచ్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పుష్పోత్సవ సేవా కార్యక్రమం జరిగింది. 11 రకాల పుష్ప ఫలాదులతో స్వామివార్లకు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివార్ల కోసం ఎర్రబంతి, పసుపుబంతి, పసుపు, తెల్లచేమంతి, మల్లెలు, కనకాంబరాలు, ఎర్ర, తెల్ల, ముద్ద, దేవ, సువర్ణ గన్నేరు, నంది, గరుడవర్థనం, మందారం, ఎర్ర , నీలం ఆస్టర్, కాగడాలు, జబ్రా, కారినేషన్, ఆర్కిడ్స్, గ్లాడియేలస్ తదితర పుష్పాలను ఉపయోగించారు. స్వామివార్ల ఏకాంత సేవ కోసం అద్దాల మండపంలోని ఊయల తల్పాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఏకాంతసేవను ఆగమ సంప్రదాయానుసారం వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. అలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Advertisement