గ్రేటర్‌లో ‘ఓరుగల్లు’ వ్యూహం
♦ వంద డివిజన్లలో గెలుపే లక్ష్యం
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం
♦ వరంగల్ ఎన్నికల్లో మాదిరిగా కష్టపడాలని సూచన
♦ ఎంఐఎంకు 50 డివిజన్లు కేటాయించేలా ప్రణాళిక
♦ డివిజన్‌కో చురుకైన నేత.. మొత్తం వంద మంది గుర్తింపు
♦ వారికి స్వయంగా శిక్షణ ఇవ్వనున్న సీఎం
♦ ఈ నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వరంగల్ ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గ్రేటర్ ఎన్నికలపై ముందస్తు కసరత్తు ప్రారంభించారు. మూడ్రోజులుగా మంత్రులు, ముఖ్య నేతలతో క్యాంపు కార్యాలయంలో ఇదే విషయంపై మంతనాలు జరిపారు. గ్రేటర్ పరిధిలో వంద డివిజన్లను గెలుచుకోవటమే లక్ష్యంగా వ్యూహ రచన చేయాలని, వరంగల్ ఎన్నికల్లో పనిచేసిన విధంగా కష్టపడాలని పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. మిగతా 50 డివిజన్లను ఎంఐఎంకు కేటాయించి పరస్పర అవగాహనతో బరిలోకి దిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఇంటింటి ప్రచారం
టీఆర్‌ఎస్ పోటీకి దిగే చోట ఒక్కో డివిజన్‌కు ఒక చురుకైన పార్టీ నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించనున్నారు. అందుకు సంబంధించి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెరికల్లాంటి కార్యకర్తలు, నాయకులు వంద మందిని వచ్చే వారం హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. అందుకు ఉద్యమంతో పాటు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన వారిని, ఎన్నికల సమయంలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే నాయకులకు ఎంపిక చేశారు. వివిధ జిల్లాల పార్టీ ముఖ్యులు చేసిన సూచనలతో ఇన్‌చార్జిల నియామక కసరత్తు పూర్తయింది. ఈ జాబితాను సీఎం పరిశీలించటంతో పాటు తానే స్వయంగా వీరికి శిక్షణ ఇవ్వనున్నట్లు పార్టీ నేతలకు వెల్లడించారు. వీరి ఆధ్వర్యంలో ఒక్కో డివిజన్‌లో ప్రత్యేకంగా పార్టీ బృందాలు ప్రచారంలో నిమగ్నమవుతాయి. గత పాలకులు హైదరాబాద్ అభివృద్ధికేం చేశారు..? టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఏమేం చేసింది వంటి విషయాలను ప్రతి ఓటరుకు తెలియజెప్పేలా ఇంటింటి ప్రచారం చేపట్టే బాధ్యతను ఈ బృందానికి అప్పగించనుంది.
ఒక్కో మంత్రికి ఐదారు డివిజన్లు
ఒక్కో మంత్రికి ఐదారు డివిజన్ల సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ నిర్వహణ సమయంలో సీఎం సహా ఒక్కో మంత్రి నగరంలోని డివిజన్ల బాధ్యతలను పంచుకున్నారు. అదే పద్ధతిని గ్రేటర్ ఎన్నికల్లోనూ పాటించాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఆ డివిజన్లపై మంత్రులకు అవగాహన కుదరటంతోపాటు స్థానిక నాయకులు, ప్రజలతో సంబంధాలు ఏర్పడినందున తిరిగి అవే డివిజన్లను మంత్రులను అప్పగిస్తున్నారు. ఇప్పట్నుంచే ఆయా డివిజన్లలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎవరికి వారుగా ముందస్తు సన్నాహాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి... మంత్రులను పురమాయించారు. వరంగల్ ఉప ఎన్నిక తెచ్చిపెట్టిన ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్‌లో పని చేయాలని, గ్రేటర్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పార్టీ నేతలను సీఎం ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
వచ్చే వారంలోనే షెడ్యూల్
డిసెంబర్ 15లోగా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే ప్రచారం మొదలైంది. డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఒకట్రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడినట్లుగానే భావించి సన్నాహాల్లో నిమగ్నం కావాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.