ఇష్టారాజ్యం..!
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో కిరికిరి
--------------------------------------------------------
అనంతపురం న్యూసిటీ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు వ్యవహారం వివాదస్పదమవుతోంది. కొన్ని డివిజన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, మరికొన్నింటిని విస్మరించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించిన డివిజన్లకే ఈసారి కూడా అవకాశం కల్పించడం దుమారం రేపుతోంది.
మూడు డివిజన్లకు రూ.88.40 లక్షలు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి 32, 33, 34 డివిజన్లకు రూ.88.40 లక్షలు కేటాయించడం గమనార్హం. అవే డివిజన్లకు గత ఏడాది రూ.70 లక్షలు కేటాయించారు. దీంతో అప్పట్లోనే డిప్యూటీ మేయర్ గంపన్నపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత వచ్చే నిధుల్లో ఇతర డివిజన్లకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడేమో రూ.4.6 కోట్లకు టెండర్లు పిలిస్తే అందులోనూ పైన పేర్కొన్న మూడు డివిజన్లకే మరోసారి పెద్దపీట వేయడం చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతిపదికన 21వ డివిజన్‌లో 2.65 శాతం, 43వ డివిజన్‌లో 2.65, 48వ డివిజన్‌లో 1.45 శాతం ఎస్సీలున్నారు. ఈ డివిజన్లకు చిల్లిగవ్వ పెట్టలేదు. తక్కువ జనాభా(0.62 శాతం) ఉన్న 26వ డివిజన్‌కు రూ.9 లక్షలు కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఎల్-1ను కాదని...
టెండర్లలో కొందరు ఎక్కువ పనులకు టెండర్లు వేశారు. దీనిపై కమిషనర్ సురేంద్రబాబు ఈఈగా ఒకేసారి ఇంత మందికి టెండర్లు ఇవ్వడం సరికాదని, మిగితా వారికి ప్రాధాన్యం కల్పించాలని లేఖ రాసినట్లు తెలిసింది. దీనిపై ఎస్‌ఈ సత్యనారాయణ అభ్యంతరం చెప్పారని సమాచారం. ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధన మేరకు ఎల్-1లకే ప్రాధాన్యం కల్పించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆడిట్, విజిలెన్స్ విచారణలు, అభ్యంతరాలు ఎదుర్కోకతప్పదని ఎస్‌ఈ హెచ్చరించినట్లుకూడడా తెలుస్తోంది. ఇందులో రూ.10 లక్షలపైన ఎక్కువ టెండర్లు ఉండడంతో వీటిని స్టాండింగ్ కమిటీ/కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. మరి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
కమిషనర్ సురేంద్రబాబు ఏమంటున్నారంటే...
సబ్‌ప్లాన్ నిధులు గడువులోగా పూర్తి చేయాలి. చాలా మంది వివిధ ప్రాంతాలకు టెండర్లు కోడ్ చేశారు. పనులు వేగవంతం చేయాలని, ఇది వరకే పనులు చేస్తున్నారనే యోచనతో మిగితా వారిని పరిశీలించాలని ఈఈగా ఎస్‌ఈకు లేఖ రాశా.