st subplan
-
సబ్‌ప్లాన్‌పై అధ్యయన కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ ఉప ప్రణాళికలో సవరణల కోసం గిరిజనసంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో మార్పు లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు. ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కొత్త పథకాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సభ్యులుగా ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, కోవా లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు నియమితుల య్యారు. ఈ మేరకు ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. -
ఇష్టారాజ్యం..!
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో కిరికిరి -------------------------------------------------------- అనంతపురం న్యూసిటీ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు వ్యవహారం వివాదస్పదమవుతోంది. కొన్ని డివిజన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, మరికొన్నింటిని విస్మరించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించిన డివిజన్లకే ఈసారి కూడా అవకాశం కల్పించడం దుమారం రేపుతోంది. మూడు డివిజన్లకు రూ.88.40 లక్షలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి 32, 33, 34 డివిజన్లకు రూ.88.40 లక్షలు కేటాయించడం గమనార్హం. అవే డివిజన్లకు గత ఏడాది రూ.70 లక్షలు కేటాయించారు. దీంతో అప్పట్లోనే డిప్యూటీ మేయర్ గంపన్నపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత వచ్చే నిధుల్లో ఇతర డివిజన్లకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడేమో రూ.4.6 కోట్లకు టెండర్లు పిలిస్తే అందులోనూ పైన పేర్కొన్న మూడు డివిజన్లకే మరోసారి పెద్దపీట వేయడం చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతిపదికన 21వ డివిజన్లో 2.65 శాతం, 43వ డివిజన్లో 2.65, 48వ డివిజన్లో 1.45 శాతం ఎస్సీలున్నారు. ఈ డివిజన్లకు చిల్లిగవ్వ పెట్టలేదు. తక్కువ జనాభా(0.62 శాతం) ఉన్న 26వ డివిజన్‌కు రూ.9 లక్షలు కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎల్-1ను కాదని... టెండర్లలో కొందరు ఎక్కువ పనులకు టెండర్లు వేశారు. దీనిపై కమిషనర్ సురేంద్రబాబు ఈఈగా ఒకేసారి ఇంత మందికి టెండర్లు ఇవ్వడం సరికాదని, మిగితా వారికి ప్రాధాన్యం కల్పించాలని లేఖ రాసినట్లు తెలిసింది. దీనిపై ఎస్ఈ సత్యనారాయణ అభ్యంతరం చెప్పారని సమాచారం. ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధన మేరకు ఎల్-1లకే ప్రాధాన్యం కల్పించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆడిట్, విజిలెన్స్ విచారణలు, అభ్యంతరాలు ఎదుర్కోకతప్పదని ఎస్ఈ హెచ్చరించినట్లుకూడడా తెలుస్తోంది. ఇందులో రూ.10 లక్షలపైన ఎక్కువ టెండర్లు ఉండడంతో వీటిని స్టాండింగ్ కమిటీ/కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. మరి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కమిషనర్ సురేంద్రబాబు ఏమంటున్నారంటే... సబ్‌ప్లాన్ నిధులు గడువులోగా పూర్తి చేయాలి. చాలా మంది వివిధ ప్రాంతాలకు టెండర్లు కోడ్ చేశారు. పనులు వేగవంతం చేయాలని, ఇది వరకే పనులు చేస్తున్నారనే యోచనతో మిగితా వారిని పరిశీలించాలని ఈఈగా ఎస్ఈకు లేఖ రాశా. -
వైద్య ఆరోగ్యంపై కరుణ లేదు!
ఆశించింది: రూ. 6,000కోట్లు కేటాయించింది: రూ. 4,932కోట్లు అందులో ప్రణాళిక బడ్జెట్ రూ. 2,460 కోట్లు దీని కింద కేంద్ర వాటా రూ. 1,147 కోట్లు మినహాయిస్తే రాష్ట్రం వాస్తవంగా... కేటాయించింది రూ. 1,242 కోట్లే ఆరోగ్యశ్రీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు భారీగా నిధుల కోత సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖపై ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శించింది. రూ. 6 వేల కోట్ల వరకు కేటాయిస్తారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేయగా వారి అంచనాలను ఆవిరిచేస్తూ కేవలం రూ. 4,932 కోట్లే కేటాయించింది. ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,460.24 కోట్లు కేటాయించగా ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 2,472.54 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో 10 నెలల కాలానికి ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,284.09 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ఏడాది కాలానికి నిర్దేశించుకున్న ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ. 176.15 కోట్లే అదనంగా కేటాయించింది. అయితే ఏడాది వ్యవధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి దీన్ని పెంపుగా పరిగణించే పరిస్థితి కనిపించట్లేదు. ప్రణాళిక బడ్జెట్ రూ. 2,460.24 కోట్లలో కేంద్ర పథకాల నుంచి అందే సాయం రూ. 1,147.34 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కేటాయింపు రూ. 1,242.25 కోట్లుకాగా... గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి రూ. 70.64 కోట్లు కేటాయిస్తారు. ఆరోగ్యశ్రీకి రూ. 323.75 కోట్లు గతేడాది తరహాలోనే ప్రస్తుత బడ్జెట్లోనూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు రూ. 323.75 కోట్లు కేటాయించారు. అయితే ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత బడ్జెట్లో రూ. 80.93 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 49.98 కోట్లే కేటాయించారు. అలాగే ఎస్టీ సబ్ఫ్లాన్కు గత బడ్జెట్లో రూ. 80.93 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 30.23 కోట్లే కేటాయించి భారీగా కోత విధించారు. జనరల్ కేటగిరీలో గత బడ్జెట్లో రూ. 161.87 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 243.52 కోట్లు కేటాయించారు. జనరల్ కేటగిరీలోని ఆరోగ్యశ్రీ రోగులకు నిధులు పెంచారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 1,218.19 కోట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు గత బడ్జెట్లో రూ. 970.89 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 1,218.19 కోట్లు కేటాయించి కాస్తంత కరుణ చూపారు. 104, 108 అత్యవసర సర్వీసులు సహా వివిధ పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈసారి కేటాయింపులు పెంచారు. అలాగే ఆరోగ్య సమాచార సహాయం కోసం రూ. 10.49 లక్షలు, కుటుంబ సంక్షేమ కేంద్రాలకు రూ. 28.67 కోట్లు, వాటి భవనాలకు రూ. 18.33 లక్షలు కేటాయించారు. ఆచరణే అసలు సమస్య గత బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినా వాటిని విడుదల చేసి పనులు చేయడంలో సర్కారు విఫలమైంది. పీహెచ్‌సీలు మొదలుకొని నిమ్స్ స్థాయి వరకు వివిధ ఆస్పత్రులను బలోపేతం చేయలేకపోయింది. అలా అనేక రంగాల్లోనూ గత బడ్జెట్ నుంచి నిధులు సరిగా విడుదల కాలేదు. ఈ బడ్జెట్లోనూ కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏమేరకు విడుదల చేస్తుందోనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలకు ప్రాధాన్యం బడ్జెట్లో వైద్యఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పేదల చెంతకు ఆరోగ్యాన్ని చేర్చే ఉద్దేశం ఇందులో కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. - సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ముఖ్య కేటాయింపులు... - ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా ఆస్పత్రులను నిమ్స్ స్థాయికి తెచ్చేందుకు చెరో రూ. 10 కోట్లు - ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు చెరో 100 కోట్లు. నీలోఫర్ ఆస్పత్రి బలోపేతానికి 30 కోట్లు - వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 5 కోట్లు. నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 92 కోట్లు - ఆదిలాబాద్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.69.47 కోట్లు. వరంగల్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 68.77 కోట్లు. వైద్య భవనాలకు రూ. 60 కోట్లు. రిమ్స్ జనరల్ ఆస్పత్రులకు రూ. 8.95 కోట్లు. - రిమ్స్ మెడికల్ కాలేజీలకు రూ. 11.76 కోట్లు -
‘సబ్‌ప్లాన్’కు జాతీయ స్థాయిలో చట్టబద్ధత
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జాతీయ సదస్సులో వక్తల డిమాండ్ సీడీఎస్, ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో సదస్సు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జాతీయస్థాయిలో చట్టబద్ధత కల్పించాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, సామాజిక సమరసతా వేదికలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్), సామాజిక సమరసతా వేదిక (ఎస్ఎస్వీ) సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన జాతీయ సదస్సులో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రముఖ్ బాగయ్య కీలకోపన్యాసం చేస్తూ దేశంలో దళితులకు, ఆదివాసీలకు అన్ని రంగాలలో నేటికీ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నారు. అందుకు ఆ వర్గాలు చదివే ప్రభుత్వ విద్యా సంస్థలను, వసతి గృహాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని బాగుచేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలో 25 శాతం జనాభా గల దళితుల అభివృద్దే దేశాభివృద్ధి అని కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేసి దేశానికి దారి చూపాయని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు పరచాలని కృష్ణన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో జరిగిన ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లు దళితుల హక్కుల పరిరక్షణకు, ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సబ్‌ప్లాన్ చట్టం చేయాలని కృష్ణన్ కోరారు. దళిత, ఆదివాసీల అభివృద్ధిలో మీడియా పాత్ర అనే అంశంపై సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం మీడియా కీలక పాత్ర పోషించిందన్నారు. సబ్‌ప్లాన్‌పై అవగాహనకోసం అనేకసార్లు మీడియా ఆధ్వర్యంలో చర్చాకార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిందన్నారు. అయితే సబ్‌ప్లాన్ చట్టం అమలుకు సైతం అంతకంటే ఎక్కువగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి తరఫున మీడియా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మిగతా వర్గాలకంటే ఎంతో వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి భారత రాజ్యాంగం కల్పించిన రక్షణలను, అవకాశాలను విస్తృతపరచి పకడ్బందీగా అమలు చేయాలని సీనియర్ జర్నలిస్టు, సీడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సామాజిక హోదాతో పాటు దళిత, ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పేర్కొన్నారు. సదస్సులో చివరిగా జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అద్దంకి దయాకర్, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకుడు గోవర్ధన్, కేవీపీఎస్ నాయకుడు జాన్ వెస్లీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్ డెరైక్టర్ ఆంజనేయులు, ఎస్ఎస్వీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జి శ్యామ్ ప్రసాద్, ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎంజీకే మూర్తి, పీఎస్ రావు, వివిధ రాష్ట్రాల దళిత నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.