వైద్య ఆరోగ్యంపై కరుణ లేదు! | No care about medical health departments in Budget | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యంపై కరుణ లేదు!

Published Thu, Mar 12 2015 5:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య ఆరోగ్యంపై కరుణ లేదు! - Sakshi

వైద్య ఆరోగ్యంపై కరుణ లేదు!

ఆశించింది: రూ. 6,000కోట్లు
 కేటాయించింది: రూ. 4,932కోట్లు
 అందులో ప్రణాళిక బడ్జెట్ రూ. 2,460 కోట్లు
 దీని కింద కేంద్ర వాటా రూ. 1,147 కోట్లు మినహాయిస్తే
 రాష్ట్రం వాస్తవంగా... కేటాయించింది రూ. 1,242 కోట్లే
 ఆరోగ్యశ్రీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు భారీగా నిధుల కోత

 
 సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శించింది. రూ. 6 వేల కోట్ల వరకు కేటాయిస్తారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేయగా వారి అంచనాలను ఆవిరిచేస్తూ కేవలం రూ. 4,932 కోట్లే కేటాయించింది. ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,460.24 కోట్లు కేటాయించగా ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 2,472.54 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో 10 నెలల కాలానికి ప్రణాళిక బడ్జెట్ కింద రూ. 2,284.09 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ఏడాది కాలానికి నిర్దేశించుకున్న ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ. 176.15 కోట్లే అదనంగా కేటాయించింది. అయితే ఏడాది వ్యవధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి దీన్ని పెంపుగా పరిగణించే పరిస్థితి కనిపించట్లేదు. ప్రణాళిక బడ్జెట్ రూ. 2,460.24 కోట్లలో కేంద్ర పథకాల నుంచి అందే సాయం రూ. 1,147.34 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కేటాయింపు రూ. 1,242.25 కోట్లుకాగా... గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి రూ. 70.64 కోట్లు కేటాయిస్తారు.
 
 ఆరోగ్యశ్రీకి రూ. 323.75 కోట్లు
 గతేడాది తరహాలోనే ప్రస్తుత బడ్జెట్‌లోనూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు రూ. 323.75 కోట్లు కేటాయించారు. అయితే ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత బడ్జెట్‌లో రూ. 80.93 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 49.98 కోట్లే కేటాయించారు. అలాగే ఎస్టీ సబ్‌ఫ్లాన్‌కు గత బడ్జెట్‌లో రూ. 80.93 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 30.23 కోట్లే కేటాయించి భారీగా కోత విధించారు. జనరల్ కేటగిరీలో గత బడ్జెట్‌లో రూ. 161.87 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ. 243.52 కోట్లు కేటాయించారు. జనరల్ కేటగిరీలోని ఆరోగ్యశ్రీ రోగులకు నిధులు పెంచారు.
 
 ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 1,218.19 కోట్లు
 ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు గత బడ్జెట్‌లో రూ. 970.89 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 1,218.19 కోట్లు కేటాయించి కాస్తంత కరుణ చూపారు. 104, 108 అత్యవసర సర్వీసులు సహా వివిధ పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈసారి కేటాయింపులు పెంచారు. అలాగే ఆరోగ్య సమాచార సహాయం కోసం రూ. 10.49 లక్షలు, కుటుంబ సంక్షేమ కేంద్రాలకు రూ. 28.67 కోట్లు, వాటి భవనాలకు రూ. 18.33 లక్షలు కేటాయించారు.
 
 ఆచరణే అసలు సమస్య
 గత బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా వాటిని విడుదల చేసి పనులు చేయడంలో సర్కారు విఫలమైంది. పీహెచ్‌సీలు మొదలుకొని నిమ్స్ స్థాయి వరకు వివిధ ఆస్పత్రులను బలోపేతం చేయలేకపోయింది. అలా అనేక రంగాల్లోనూ గత బడ్జెట్ నుంచి నిధులు సరిగా విడుదల కాలేదు. ఈ బడ్జెట్‌లోనూ కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏమేరకు విడుదల చేస్తుందోనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
 
 సౌకర్యాలకు ప్రాధాన్యం
 బడ్జెట్‌లో వైద్యఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పేదల చెంతకు ఆరోగ్యాన్ని చేర్చే ఉద్దేశం ఇందులో కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
 - సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
 
 ముఖ్య కేటాయింపులు...
 -    ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా ఆస్పత్రులను నిమ్స్ స్థాయికి తెచ్చేందుకు చెరో రూ. 10 కోట్లు
 -    ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు చెరో 100 కోట్లు. నీలోఫర్ ఆస్పత్రి బలోపేతానికి 30 కోట్లు
 - వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 5 కోట్లు. నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 92 కోట్లు
 - ఆదిలాబాద్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.69.47 కోట్లు. వరంగల్‌లో కొత్త నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 68.77 కోట్లు. వైద్య భవనాలకు రూ. 60 కోట్లు. రిమ్స్ జనరల్ ఆస్పత్రులకు రూ. 8.95 కోట్లు.
 -    రిమ్స్ మెడికల్ కాలేజీలకు రూ. 11.76 కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement