ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేసే బాధ్యత నాదే | DC Minister Bhatti vows effective implementation of SC and ST Sub Plan | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేసే బాధ్యత నాదే

Published Sun, Jan 12 2025 5:16 AM | Last Updated on Sun, Jan 12 2025 5:16 AM

DC Minister Bhatti vows effective implementation of SC and ST Sub Plan

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాగార్జునసాగర్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సహచర మంత్రులతో కలిసి సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగార్జునసాగర్‌ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ, గిరిజన ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి తాను చీఫ్‌విప్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టా నానికి నివేదిక ఇచ్చి అమలు చేయాలని కోరానని చెప్పారు. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఈ చట్టం ఆమోదం పొందిందన్నారు.

చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింపచేసిన వ్యక్తిగా తనకు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరిచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందా? లేదా అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటికే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నివేదికలు సమర్పించారని, మిగిలిన శాఖల నుంచి నివేదికలు త్వరలో తెప్పించి సమగ్రంగా సమీక్షిస్తానని తెలిపారు.

రాష్ట్రంలో పీసా, అటవీ హక్కుల చట్టాలను 100 శాతం సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూముల్లో విద్యుత్‌ సౌకర్యం పొందేందుకు లైన్‌లు వేసే క్రమంలో ఆ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సోలార్‌ పవర్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి మోటార్ల ద్వారా ఆయా భూములు సాగులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. 

బడ్జెట్‌లో ఆదివాసీ, గిరిజనులకు పదిశాతం 
రాష్ట్ర బడ్జెట్‌లో ఆదివాసీ, గిరిజనులకు పదిశాతం కంటే తక్కువ కాకుండా కేటాయిస్తామని మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడానికే ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గిరిజన, ఆదివాసీ సంక్షేమ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement