పేరు ఒకరిది.. అద్దెలో మరొకరు..
-
గంజ్ లీజు లీలలు
-
ఇతరులకు అద్దెకిచ్చిన లీజుదారులు
-
మార్కెట్ విలువతో సొమ్ము చేసుకుంటున్న వైనం
-
సర్కార్‌కు నామమాత్రపు అద్దె చెల్లింపు
-
గడువు ముగిసినా రాజకీయ అండదండలు
ముకరంపుర : గంజ్‌హైస్కూల్ షట్టర్ల లీజుదారుల లీలలు అన్నీ ఇన్నీ కావు.. లీజు గడువు ముగిసి ఎనిమిదేళ్లుగా గడిచినా షట్టర్లను వ్యాపారులు వదలడంలేదు. మార్కెట్ విలువ ప్రకారం ఇతరులకు అద్దెకిచ్చి కూడా సొమ్ము చేసుకుంటున్నారు. స్పందించాల్సిన ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
1983 నుంచి 2007 జనవరి వరకు 25ఏళ్ల ఒప్పందంలో అతి తక్కువగా నెలకు రూ.180 అద్దె చెల్లించారు. గడువు ముగిసి షట్టర్లను విద్యాశాఖకు అప్పగించకుండా ఖాళీ చేయలేమంటూ కోర్టును ఆ్రÔ¶ యించారు. కోర్టుకేసును సస్పెండ్ చేసినా షట్టర్లను వదలకుండా అదే 21 మంది లీజుదారులు నామమాత్రపు రూ.1,365 అద్దెతో లోపాయికారీగా అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. లీజుదారుల్లో క్రమంగా వారి కొడుకులు, మనుమళ్లు దుకాణాలకు యజమానులుగా చెలామణి అవుతున్నారు. ఈ షట్టర్ల నిర్వహణ బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించినా తీరు మారలేదు. ప్రధానంగా గంజ్‌హైస్కూల్ విద్యాశాఖ ఆధీనంలో ఉన్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 21 షట్టర్ల లీజుదారులు అటు అధికార, ఇటు ప్రతిపక్ష నేతలకు దగ్గరగా ఉండడంతో దీనిపై ఎవరూ నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పైగా ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ప్రకాశం గంజ్ ఓనర్స్ అసోసియేషన్ పేరిట ఈ వ్యవహారాన్ని మూమూలుగా నడిపిస్తున్నారు.
ఇతరులకు అద్దె..
ఈదుకాణాలలోని 8 షటర్లకు పైగా లీజుదారులు ఇతరులకు రూ.15వేల చొప్పున అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. 25 ఏళ్ల ఒప్పందంలో మున్సిపల్ పన్నులు పెరుగుదలకు అనుగుణంగా అద్దె పెంచాలని పేర్కొన్నా ఒక్కసారి కూడా అద్దె పెంచలేదు. సర్కార్ నిర్ణయంలోని అద్దెకనుగుణంగా 21 షటర్లు మొత్తంగా రూ.37.35 లక్షల అద్దె బకాయిపడినా చెల్లించలేదు. గడువు ముగిసినా మార్కెట్ ధరకు అనుగుణంగా అద్దె పెంచకపోవడంతో రూ.2కోట్లకు పైగా ఎగ్గొట్టారు. ఇదీ కాకుండా రూ.1365 నామమాత్రపు అద్దెను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఇతరులకు రూ.15 వేల చొప్పున షట్టర్లను అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇందులో ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖాధికారులకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ‘కదలరు..వదలరు., అద్దె షట్టర్ల వ్యవహారంలో నేతల జోక్యం..’ శీర్షికన వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో లీజుదారులు సమావేశమైనట్లు తెలిసింది. అటు నేతలతో పైరవీలు చేయిస్తూ రాజకీయ రంగు పులుముతూనే.. అధికారులకిచ్చే మామూళ్ల విషయంలో ఒక్కటై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉందని విద్యాశాఖ.. వారి పరిధిలోనే ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ చేతులెత్తేస్తోంది. దీన్ని వ్యాపారులు తమకు కలిసివచ్చేలా మలుచుకుంటున్నారు.
లీజుదారులు వీరే అయినా...!
గంజ్‌హైస్కూల్ షటర్లలో 21దుకాణాలను లీజుకిచ్చారు. 1983 నుంచి 2008 జనవరి వరకు ఒప్పందంలో కేటాయించిన లీజుదారులు ఇలా ఉన్నారు. డి.లక్ష్మీనారాయణ, ఎండీ.షాదాత్‌ఖాన్, డి.పాపయ్య, సీహెచ్.బాలనర్సమ్మ, ఎన్.రాజయ్య, ఆర్.రాజేశం, ఎస్.రాములు, జి.శంకరయ్య, జె.రాధమ్మ, వి.ధనలక్ష్మి, వి.ఈశ్వరమ్మ, జి.సుగుణమ్మ, జి.రాజిరెడ్డి, బి.వరలక్ష్మి, కె.సత్తయ్య. ఇ.వీరేశం, బి.కైలాసం, టి.చంద్రమౌళి, ఎన్.వెంకటేశం, సి.హెచ్.దామోదర్‌రావు, నీరజకు కేటాయించారు. ఇందులో 10మంది మాత్రమే దుకాణాలను నడిపిస్తుండగా.. మిగిలిన వాటిలో కొడుకులు, మనవళ్లు, ఇతరుల పేరు మీద అద్దెకిచ్చి కొనసాగిస్తున్నారు.
సాధ్యమైనంతలో...
–రాఘవాచార్యులు, ఆర్‌అండ్‌బీ ఈఈ
జీవో ప్రకారం గంజ్‌హైస్కూల్ షట్టర్లు విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. టెక్నికల్‌గా బిల్డింగ్ బాధ్యతలకై గతంలో ఐదేళ్లు మాత్రమే ఆర్‌అండ్‌బీలో పరిధిలో ఉంది. ఆ తర్వాత విద్యాశాఖ ఆ ఆస్తులను తమ పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. మేము కూడా పిటిషన్ దాఖలు చేశాం. సాధ్యమైనంత వరకు షట్టర్లను టేక్‌ఓవర్ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం.