ఏకంగా దేవుణ్నే ఎత్తుకెళ్లారు..
రొంపిచర్ల: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని శంకరస్వామి శివాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున గుడి ఆవరణలోకి వెళ్ళిన పూజారి రొంపిచర్ల శ్రీనివాసశర్మ ఈ విషయాన్ని గమనించాడు. గుడి పక్కనే ఉండాల్సిన నందీశ్వరుడి విగ్రహం లేకపోవడంతో ఆయన విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేశారు. నందీశ్వరుడి విగ్రహం ఉండాల్సిన చోట గడ్డపారలతో తవ్వి పెకలించారు. ఈ సంఘటనతో రొంపిచర్ల గ్రామస్తుల్లో కలకలం చెలరేగింది.
ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని వెళ్లారు. ఆలయం ఊరికి దూరంగా నరసరావుపేట రోడ్డులో ఉండటంతో పాటు ప్రహరీ గోడ లేకపోవడమే దొంగతనానికి అవకాశాన్ని కలిగించిందని గ్రామస్తులు అంటున్నారు. ఐదేళ్ల క్రితం గాలిగోపురం కూలిపోయిందని, ఇప్పటి వరకు పునరుద్ధరణ జరగలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే ఓసారి ఆలయంలోని విగ్రహాలు, ద్వజస్తంభ గంటలు కూడా చోరీకి గురయ్యాయని వారు తెలిపారు.