సాక్షి, పల్నాడు: జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి.
బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే..
గతంలో.. ఆరు నెలల కిందట బాలకోటిరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో ఈ దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ తీవ్రంగా యత్నించింది. నారా లోకేష్‌ను సైతం రంగంలోకి దించాలనుకుంది. అయితే.. ఈలోపే దాడికి తానే బాధ్యుడినంటూ స్థానిక టీడీపీ నేత పమ్మి వెంకట్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. పార్టీలో విభేధాలు ఉన్నాయని, నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు.. డబ్బులు తాను ఖర్చు పెడుతుంటే బాలకోటిరెడ్డిని ప్రొత్సహిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయి.. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు అప్పుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. తాజా దాడి కూడా ఈ కోణంలోనే జరిగిందా? లేదా మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment