పిన్నెల్లికి సమాచారం.. రంగంలోకి దిగిన పోలీసులు
కారంపూడి సమీపంలో వదిలేసి పరారైన దుండగులు
క్షేమంగా ఇంటికి చేరిన పీఏ శ్రీనివాస శర్మ
మాచర్ల: మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ ఎం.శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేయడానికి టీడీపీ వర్గీయులుగా భావిస్తున్న కొందరు గూండాలు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన్ని వదిలేసి పరారయ్యారు. శర్మ కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. పిన్నెల్లికి చాలా కాలం నుంచి పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను టీడీపీ వర్గీయులు కొందరు టార్గెట్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆయన ఇంటికి టీడీపీ గుర్తులు కలిగిన స్కారి్పయో వాహనంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు వచ్చారు.
ఇంటి ముందు వాహనాన్ని ఆపి హడావుడిగా దిగారు. ఆ ప్రాంతానికి ఇతరులు రాకుండా ముగ్గురు నిలబడగా, ఇద్దరు ఇంటి ముందు తలుపులను కర్రలతో కొట్టారు. అవి రాకపోవటంతో మరో వైపు నుంచి తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీనివాస శర్మను బెదిరించారు. తన భర్తను ఏమీ అనవద్దని, కొట్టవద్దని శర్మ భార్య వేడుకొన్నా వారు దౌర్జన్యంగా ప్రవర్తించారు. శర్మ రావాల్సిందేనని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించారు. శ్రీనివాసశర్మ రానని చెప్పటంతో బయట ఉన్న ముగ్గురు కూడా లోపలకు వచ్చారు. శర్మను బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.
స్కార్పియోలో గుంటూరు రోడ్డు వైపు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా పలువురు సమాచారమిచ్చారు. పట్టణ, నియోజక వర్గంలోని సీఐలు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిడ్నాపర్లు శ్రీనివాస శర్మను కారంపూడి సమీపంలో వదిలివేసి పరారయ్యారు. ఆయన తెలిసిన వారి వాహనం ఎక్కి మాచర్లలోని ఇంటికి చేరుకున్నారు. వెంటనే కారంపూడి, మాచర్ల అర్బన్, రూరల్ సీఐలు శర్మ ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మాచర్ల అర్బన్ సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment