పోలీసులే కిడ్నాప్‌ చేస్తే! | Macherla police attacked and kidnapped Srinunayak | Sakshi
Sakshi News home page

పోలీసులే కిడ్నాప్‌ చేస్తే!

Published Wed, Dec 11 2024 5:35 AM | Last Updated on Wed, Dec 11 2024 5:35 AM

Macherla police attacked and kidnapped Srinunayak

కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేత శ్రీనునాయక్‌ 

అతడిపై దాడికి పాల్పడి కిడ్నాప్‌ చేసిన మాచర్ల పోలీసులు 

కూటమి అధికారంలోకి వచ్చాక అతడిపై మూడు అక్రమ కేసులు 

సాక్షి, నరసరావుపేట: పట్టపగలు న్యాయస్థాన ప్రాంగణంలో గిరిజన నేతపై దాడి చేయడమే కాకుండా బలవంతంగా అపహరించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే రౌడీల అవతారమెత్తారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చి న నిందితుడిని కోర్టు ప్రాంగణంలోనే కిడ్నాప్‌ చేశారు. దుర్గి మండలం కాకిరాలకు చెందిన వైఎస్సార్‌సీపీ  నేత రమావత్‌ శ్రీనునాయక్‌పై ఇప్పటికే మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో రెండు కేసుల్లో సుమారు 70 రోజులపాటు సబ్‌జైలులో ఉన్న శ్రీనునాయక్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. 

జైలులో ఉన్న సమయంలో అప్పటికే నమోదైన మూడో కేసులో పీటీ వారెంట్‌ వేయకుండా బయటకు వచ్చి న తరువాత అరెస్ట్‌ చేసి హింసించాలన్న దురుద్దేశంతో పోలీసులు ఆ సమయంలో అరెస్ట్‌ చూపలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఎలాగైనా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయాలని పోలీసులపై టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చి0ది. విషయం తెలుసుకున్న శ్రీనునాయక్‌ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు. 

కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోలీసులు వేధింపులు గురి చేస్తుండటంతో శ్రీనునాయక్‌ కోర్టులో లొంగిపోయేందుకు మంగళవారం మాచర్ల న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టులో సరెండర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరికొన్ని నిమిషాల్లో న్యాయమూర్తి ఎదుట హాజరవుతడనగా.. మాచర్ల పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా శ్రీనునాయక్‌ను కోర్టు ప్రాంగణం నుంచి నెట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. గమనించిన అతని తరపు న్యాయవాది రామానాయక్‌ అడ్డుకోబోయాడు. అయినప్పటికీ పోలీసులు చొక్కా చించి దాడికి పాల్పడ్డారు. అ సమయంలో శ్రీనునాయక్‌ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. 

కోర్టు ప్రాంగణంలో పోలీసులు వ్యవహరిస్తున్న దౌర్జన్యకాండను మరో న్యాయవాది షేక్‌ ఖాసిం తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. గమనించిన పోలీసులు న్యాయవాది వద్ద నుంచి ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఎవరూ ముందుకు రావద్దంటూ పోలీసులు బెదిరిస్తూ శ్రీనునాయక్‌ను కిడ్నాప్‌ చేసి కార్‌లో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం న్యాయ­వాది రామానాయక్‌ జరిగిన ఘటనను న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చే­శారు.

లొంగిపోయేందుకు వచ్చిన తమ క్లయింట్‌ను పోలీసులు బలవంతంగా అపహరించడంతోపాటు తనపట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యా­దులో పేర్కొన్నారు. శ్రీనునాయక్‌ రక్తంతో తడిసిన తన చొక్కాను న్యాయమూర్తికి అప్ప­గించినట్టు రామానాయక్‌ తెలిపారు. న్యాయ­స్థాన ప్రాంగణంలో పోలీసుల దౌర్జన్యకాండ పట్ల న్యాయవాదులు మండిపడుతున్నా­రు.   

నా భర్తకు ప్రాణహాని ఉంది 
పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కిడ్నాప్‌కు గురైన శ్రీనునాయక్‌ భార్య లక్ష్మీభాయ్‌ విలేకరుల ఎదుట వాపోయింది. కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన తరువాత ఎక్కడ పెట్టారో చెప్పలేదన్నారు. తన భర్తను చూసేందుకు పోలీస్‌ట స్టేషన్‌కు వెళ్లినా అక్కడ లేడని వెనక్కి పంపారన్నారు.  కాగా.. పాత కేసులో నిందితుడిగా ఉన్న  శ్రీనునాయక్‌ను కోర్టు సమీపంలో అరెస్ట్‌ చేశామని గురజాల డీఎస్పీ జగదీష్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement