భూ వివాదం విషయంలో మునీర్ అనే టీచర్‌ను కిడ్నాప్ చేసిన పోలీసులు
2016 నుంచి వివాదంలో రూ.20 కోట్ల విలువైన భూమి.. కోర్టుతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకు ఒత్తిళ్లు
పోలీసుల ఒత్తిడి, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెంబేలెత్తుతున్న మునీర్ అహ్మద్
కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్ వ్యవహారం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే. ఎవరిని ఆశ్రయించాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరును, ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూవివాదాన్ని కోర్టులతో పనిలేకుండా సెటిల్ చేసుకోవాలంటూ ఓ ఉపాధ్యాయుడిని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకూ బెదిరించి మరీ అతడిని ఇంటికి పంపారు.
కిడ్నాపైన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, అతని భార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మునీర్ శనివారం స్కూల్‌లో పాఠాలు చెబుతుండగా.. ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్మాస్టర్కు చెప్పి వస్తానన్నా వినకుండా సెల్‌ఫోన్ లాగేసుకుని అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే.. వెల్దుర్తి స్టేషన్ అని ఒకసారి, డీఐజీ ఆఫీసుకు అని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘ఏంటి గన్‌తో కాల్చి చంపేస్తారా’ అని గట్టిగా కేకలు వేయగా పోలీసులు అతడి నోరుమూసేశారు. అక్కడ ఓ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూల్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్‌ను ఉంచారు.
పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూవివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్‌ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి తీసుకెళ్లారో అర్థంకాక అతడి సతీమణి రెహానాబేగం, పాఠశాల హెడ్‌మాస్టర్ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు త్రీటౌన్ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు.
అసలు కారణం ఇదీ
మునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు భాగపరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నంబర్ 649/2ఏలో 1.17 ఎకరాలు మునీర్ అధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన సర్వే నంబర్లలోనే మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్ కోర్టును ఆశ్రయించాడు.
కోర్టు మునీర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్ అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మనీశ్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్‌ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. సెప్టెంబర్‌లో ధనుంజయ్, అతడి తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు.
ఆపై సీఐ మురళీధర్‌రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డీఐజీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీర్‌కు, అతని సోదరుడు మక్బూల్‌కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ‘భూ వివాదం తెంచుకోవాలి. ఇక్కడ లా ముఖ్యం కాదు.
ఇప్పటికే 9 ఏళ్లయింది. మరో పదేళ్లయినా కోర్టులో తెగదు. ఆలోచించుకోండి. ఒక రేటు మాట్లాడుకుని వదిలేయండి. మా సీఐ మీ వాళ్లతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్‌ను కిడ్నాప్ చేసి, అర్ధరాత్రి తిరిగి పంపించారు.
నన్ను చంపేస్తారు
నన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్‌తో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేటు కంటే 30 శాతం తక్కువ ఇచ్చినా వదిలేస్తా. కానీ.. వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి.
నాకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. పోలీసుల తీరు, ధనుంజయ్ తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డి బెదిరింపులు చూస్తే కచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం కలుగుతోంది. నన్ను చంపినా ఫర్వాలేదు. నా భార్య, బిడ్డలైనా బతికితే చాలు. నేను ముస్లిం కాబట్టే బెదిరిస్తున్నారా అనిపిస్తోంది. – మునీర్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment