నేడు ఘనంగా పుష్కరాల ముగింపు
బాసరలో అధికారిక వేడుకలు
ఇప్పటికే 6 కోట్ల మంది స్నానాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ముగింపు వేడుకలను కూడా అంతే ఘనంగా జరపనుంది. ఈ నెల 14న పుష్కరాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ప్రారంభించడం తెలిసిందే. ముగింపు వేడుకలను శనివారం ఆదిలాబాద్ జిల్లా బాసరలో నిర్వహించనున్నారు. బాసర సరస్వతీ అమ్మవారికి హారతి ఇచ్చాక ఆలయం నుంచి గోదావరి ఒడ్డు వరకు ఊరేగింపు జరుపుతారు. అక్కడ గోదావరికి మహాహారతి ఇచ్చి పుష్కరాలను అధికారికంగా ముగిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుంచి 7.30 దాకా ‘గోదావరి సంబురాలు’ పేర బాసర ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఈ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే తెలంగాణలోని ఐదు గోదావరి పరీవాహక జిల్లాల్లోనూ ప్రధాన పుష్కర ఘాట్లలో నదీమతల్లికి మహాహారతి ఇవ్వనున్నారు. ఈ 11 రోజుల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 5.98 కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజైన శనివారం కూడా భక్తులు పోటెత్తవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దృష్ట్యా ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు.