గోదావరి పరవళ్లు
-
3,93,277 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం :
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ఉధృతి పెరిగింది. భద్రాచలంలో గురువారం మధ్యాహ్నం వరకూ నీటి ఉధృతి పెరుగుతూ 33 అడుగులకు చేరింది. అక్కడ నుంచి నిలకడగా కొనసాగుతోంది. అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులూ లేకుండా బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి బ్యారేజ్ వద్ద 9 అడుగుల నీటిమట్టం నెలకొంది. బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను మీటరు మేర ఎత్తి 3,93,277 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 3,300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.71 మీటర్లు, పేరూరులో 9.10 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.50 మీటర్లు, కూనవరంలో 11.62 మీటర్లు, కుంటలో 8.75 మీటర్లు, కొయిదాలో 15.49 మీటర్లు, పోలవరంలో 10.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.23 మీటర్ల వద్ద నీటిమట్టాలు నెలకొన్నాయి.