గలగలా గోదారి..
కాస్త ఊరట
పెరిగిన సహజ జలాలు
రోజుకు 2,700 క్యూసెక్కుల రాక
రబీకి ఢోకా ఉండదంటున్న అధికారులు
అమలాపురం (అమలాపురం) : రబీవరి చేలు పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న కీలక సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాల రాక గడిచిన రెండు రోజులుగా పెరిగింది. కీలక సమయంలో నీరు పెరగడం రైతుల్లో ఆనందాన్ని నింపుతుండగా, అధికారుల్లో కొంత వరకు ఒత్తిడి తగ్గింది. వారం రోజుల క్రితం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాల రాక కేవలం 965 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో సీలేరు పవర్ జనరేషన్, బైపాస్‌లో ఏకంగా 7,575 క్యూసెక్కులు మాత్రమే. దీంతో వచ్చిన 8,400 క్యూసెక్కుల నీటిని మూడు కాలువలకు విడిచిపెడుతున్నారు. రెండు రోజుల్లో జిల్లాలో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దీని వల్ల ఏజెన్సీలోని పాములేరు, ఎద్దువాగు వంటి వాగుల నుంచి నీరు గోదావరిలోకి వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సహజ జలాలు 2,700 క్యూసెక్కులకు పెరిగాయి. అడపాదడపా వర్షాలు పడితే ఇదే ఒరవడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బ్యారేజ్ వద్ద పాండెలెవెల్ 13.63 మీటర్ల మేరకు పెంచారు. సహజ జలాలు తగ్గినా రబీకి నీటికి వచ్చే ఎద్దడి ఉండదని అధికారులు «ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రబీకి ఢోకా లేదు
రబీకి ఎట్టిపరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి వచ్చే అవకాశం లేదు. సహజ జలాల రాక పెరిగింది. ఇది కొంతకాలం ఉంటుంది. ఇదే సమయంలో బ్యారేజ్ వద్ద 2.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సీలేరు నుంచి క్రమం తప్పకుండా నీరు వచ్చే చర్యలు తీసుకున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.
– ఎన్‌వీ కృషారావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం