‘కంది’ అక్రమ నిల్వలను వెలికితీయాలి
♦ అమరావతికి వెళ్తున్నా: దత్తాత్రేయ
♦11వ అలయ్‌బలయ్‌కు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కందితోపాటు ఇతర పప్పు దినుసుల అక్రమ నిల్వలపై దాడులు చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. పార్టీ నేతలు ప్రకాశ్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్‌తో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పప్పు దినుసుల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. పప్పు ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందన్నారు. పప్పును అక్రమంగా బ్లాక్‌మార్కెటింగ్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌మార్కెట్ చేసే వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పు దినుసులను కాకుండా పత్తి, పండ్లు, పూలతోటలు సాగు చేయడం వల్ల దిగుబడి తగ్గిపోయిందన్నారు. పప్పు దినుసుల సాగును పెంచడానికి విత్తనాలను అందించడం, వీటి సాగుకోసం ఎరువులను సగం సబ్సిడీకి అందించడం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బ్లాక్ మార్కెట్‌లపై దాడులు చేసి నిల్వలను వెలికితీయాలని, ఎగుమతులపై పన్నులను పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా చర్యలను తీసుకోవాలని సూచించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న జరిగే 11వ అలయ్‌బలయ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. దీనికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, ఎం.వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు, ప్రతిపక్షనాయకులను ఆహ్వానించినట్టుగా చెప్పారు.