రవి (ఫైల్),విజయకుమారి (ఫైల్)
* తమ్ముడ్ని కోల్పోయిన బాధతో ప్రాణాలు విడిచిన అక్క
* ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం
కొమరోలు: సెలవులకు ఇంటికి వచ్చిన ఆర్మీ జవాను తిరిగి విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ గుండెపోటుతో మరణించాడు. ఆ వార్త తెలుసుకున్న అతడి సోదరి గుండెలవిసేలా రోదించి ప్రాణాలొదిలింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచే సుకుంది. కొమరోలు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఇసుకల రవి (35) 15 ఏళ్ల నుంచి ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెలలో సెలవులపై ఇంటికి వచ్చాడు.
భారత్- పాక్ సరిహద్దులో యుద్ధ వాతారణం నెలకొన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరయ్యేందుకు రవి బుధవారం బయల్దేరాడు. విజయవాడ సమీపంలో గుండెనొప్పి రావటంతో కారులోనే ఉన్న బంధువులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మృతి చెందాడు. గురువారం ఉదయం భౌతిక కాయూన్ని స్వగ్రామం కొమరోలుకు తీసుకొచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి అక్క సత్వేలి విజయకుమారి(40) బోరున విలపిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయకుమారికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.