komarolu
-
కొక్కొరొకో.. ఎంత సొగసో.. అందాల పోటీలకు సై అంటున్న కోడిపుంజులు
‘‘నడత హుందాగా ఉండాలి..నడకలో హొయలొలకాలి..రంగు మెరిపించాలి.. పొంగు భళా అనిపించాలి..’’ ఇవి గ్లామర్ కాంటెస్ట్‌లో పోటీపడే బ్యూటీలకు కావాల్సిన అర్హతలని చదువుతుంటేనే అర్థమైపోతుంది. అయితే ఆ అందం గంప కింద నుంచి రావాలి అనే కొత్త రూల్ చదివితే మాత్రం మైండ్ బ్లాంకైపోతుంది. అవును.. ఆ గంప కింద ఉన్న కోడి ఇప్పుడు అందాల ర్యాంప్‌పైన కూస్తోంది. తోటి కోళ్లతో పోటీపడి మరీ వయ్యారాలొలకబోస్తోంది. అందాల కోడి కిరీటం కోసం ‘సై’ అంటోంది. కోడేమిటి? అందాల పోటీలేమిటి? సమాధానమే ఈ కథనం..ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మరి.. కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాష ..పక్షి ప్రేమికుడు. ఇతని వద్ద రకరకాల పక్షులతోపాటు వివిధ రకాల కోడి పుంజులు, పెట్టలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపిస్తున్న పుంజుల గురించి అడగగా..ఇవి అందాల పోటీల కోళ్లని చెప్పడంతో ఆశ్చర్యపోయాం.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అందాల పోటీలా? ఎక్కడ జరుగుతున్నాయి..? ఏంటి ప్రత్యేకతలు అని ప్రశ్నించాం.. మనకు సంప్రదాయ బద్ధంగా సంక్రాంతికి గోదారోళ్లు నిర్వహించే కోడి పందేల్లా..తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పాడు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరవుతున్నాం. ఈ సారి రాష్ట్రంలోని పెంపకందారులం అందరం కలసి అసోసియేషన్‌గా ఏర్పడ్డాం. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సంక్రాంతికి కోడి అందాల పోటీలు నిర్వహించారని చెప్పాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక, చత్తీస్ఘడ్, ఒడిసా, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల వారు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. వయ్యారాలొలకబోసే కోడి పుంజుల ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఆహార్యం..అద్భుతం ఈ పోటీల్లో పాల్గొనే పుంజులు ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండాలి. తల నుంచి బాడీ, తోక, కాళ్ల వరకూ అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే. మెడ నిటారుగా 90 డిగ్రీలో బాడీ ఉండాలి. తెల్ల కళ్లు బెస్ట్ క్వాలిటీ..తలపై భాగం జుట్టు ఎర్రగా ఉండి గుండ్రంగా గులాబి రేకుల్లా ముద్దగా పువ్వు అతికించినట్టుగా ఉండాలి. బాడీ దృఢంగా ఉండి కాళ్లు..కాళ్లు మధ్య ఎడం ఉండాలి. బాడీ బిల్డర్ ఎలా నడుస్తాడో అలా నడకలో స్టైల్ ఉండాలి. కాళ్ల వేళ్లు పొడవుగా చక్కగా ఉండాలి. తోక అందంగా ఉండి ఈకలు దుబ్బగా ఉండాలి. తెలుపు, రెడ్, బ్లాక్ కిరీ ఇలా కోడి మొత్తం ఫ్యాన్సీ కలర్లో ఉంటే అందరూ ఇష్టపడతారు. ఎంపిక ఇలా.. అందాల పోటీల ఎంపిక ఇలా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కోళ్లను ముందుగా నిర్వాహకులు పరిశీలిస్తారు. అర్హమైన వాటిని గుర్తిస్తారు. వాటికి నంబర్‌తో కూడిన ట్యాగ్లు ఇస్తారు. ఐదుగురు న్యాయనిర్ణేతలు ఉంటారు. అందులో ప్రభుత్వాధికారులు (పశుసంవర్ధకశాఖకు చెందిన) కూడా ఉంటారు. మధ్యలో ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు. నంబర్ ప్రకారం పిలుస్తారు. టేబుల్‌పై ఉంచిన పుంజును జడ్జిలు పరిశీలించి మార్కులు ఇస్తారు. ఒకరు ముక్కు నుంచి మెడ వరకూ ఎంత దూరం ఉంది అని పరిశీలిస్తారు. మరొకరు బాడీ స్టైల్, రంగు, కాళ్లు, కళ్లు ఇలా అన్నీ పరిశీలిస్తారు. ఈ ఐదుగురు ఇచ్చిన మార్కులను కలుపుతారు. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన పుంజును విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యేక శిక్షణ: పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోటీలకు మూడు నెలల నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ ఇస్తారు. బెదురు పోయేందుకు బాడీని నిమురుతారు. అలాగే నీళ్లతో తడుపుతారు. ఇసుకలో పొర్లిస్తారు. ఇలా చేయడం ద్వారా ఈక ఒత్తుగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండేళ్లు పెంచుతారు. పోటీలకు సిద్ధమయ్యే పుంజులు ఏడు నుంచి ఎనిమిది కేజీల బరువు ఉండేలా చూసుకుంటారు. డబుల్ బాడీ వచ్చేలా ఫీడింగ్ ఇస్తారు. గంభీరంగా బాడీబిల్డర్‌లా ఉంటుంది. కాళ్లు దృఢంగా, పాదాలు పెద్ద పెద్దగా ఉండేలా చూసుకుంటారు. వీటిని ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంచుతారు. పౌష్టికాహారం... ఈ పోటీలకు సిద్ధం చేసే పుంజులకు ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. జొన్నలు, రాగులు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, పెసలు, గుడ్డు, ఖర్జూరం, పిస్తా, బాదం, జీడిపప్పు, పండ్లు తినిపిస్తారు. రోజూ మూడు విడతలుగా ఆహారం ఇస్తారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సమ్మర్లో వేడి తగ్గించేందుకు పుచ్చకాయ పెడతారు. ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ కొలత ప్రకారం జొన్నలు, రాగులు, సజ్జ, మొక్కజొన్న, పెసలు, గోధుమలు ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోడి గుడ్డు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు అరటి, దానిమ్మ, ద్రాక్ష పండ్లు ఇస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడంతో శరీరం బలిష్టంగా ఉంటుంది. అందాల పోటీలకు ఒక కోడిని తయారు చేసేందుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆహారాన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది. క్రాస్ బ్రీడింగ్.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉండే బ్రీడర్ దగ్గర నుంచి బ్రీడ్ తెచ్చుకుంటారు. ఇక్కడ పెట్టలతో క్రాస్ బ్రీడ్ చేస్తారు. అలా వచ్చిన పుంజులను రెండేళ్లపాటు పెంచుతారు. వీటి గుడ్డు కూడా చాలా విలువైంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. మన జిల్లాలో రూ.1000 ఉంటుంది. తమిళనాడులో అయితే రూ.5 వేల వరకూ ఉంటుంది. చిన్న, చిన్న పిల్లలను ఆసక్తి ఉన్నవారికి విక్రయిస్తుంటారు. ఆసక్తితోపాటు ఆదాయం.. చిన్నప్పటి నుంచి పక్షులను పెంచడం హాబీగా ఉండేది. తమిళనాడులో అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మిత్రుడు చెప్పాడు. ఒకసారి వెళ్లి చూసి వచ్చిన తర్వాత కోడి పుంజులను పెంచాలన్న ఆసక్తి నెలకొంది. మంచి బ్రీడ్లను తీసుకొచ్చాను. అలా పుంజులను పోటీలకు సిద్ధం చేస్తున్నా. అనంతపురంలో తొలిసారిగా నిర్వహించిన పోటీలకు పుంజును తీసుకువెళ్లా. ఈ పోటీల్లో నాలుగో స్థానం వచ్చింది. వీటిని పెంచి ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ద్వారా ఉపాధి కూడా ఉంటోంది. – సయ్యద్ బాష, రాజుపాలెం, కొమరోలు మండలం చదవండి: బ్రాండెడ్ గుడ్డు గురూ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్! -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
ఆ ఊరే.. ఒక సైన్యం
కొమరోలు: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఆర్మీ జవాన్లు. ఆ ఊరిలో 86 కుటుంబాలు ఉంటే అందులో 130 మంది సైనికులు, మాజీ సైనికులే. వీరంతా ముస్లింలే కావడం మరో విశేషం. ప్రస్తుత కాలంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నా తమ ప్రాధాన్యత మాత్రం దేశ రక్షణకే అంటోంది.. ఈ గ్రామం. ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఊరు మొత్తం దేశసేవకే అంకితమవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ గ్రామమే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె. ఇండియన్ ఆర్మీకి వీర సైనికులను అందిస్తున్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. ఆయన పేరుతోనే ఊరు.. శతాబ్దం కిందట ఈ గ్రామ ప్రాంతానికి మల్లారెడ్డి అనే రైతు వలస వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. దీంతో ఊరిపేరు మల్లారెడ్డిపల్లెగా స్థిరపడిపోయింది. కాలక్రమేణా మల్లారెడ్డి కుటుంబీకులు గ్రామం నుంచి వలస వెళ్లిపోయారు. తర్వాత ముస్లింలు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ముస్లింలు తప్ప మరే సామాజికవర్గానికి చెందినవారు లేరు. మల్లారెడ్డిపల్లె గ్రామం వ్యూ 5 దశాబ్దాల క్రితం నుంచే దేశసేవ.. మల్లారెడ్డిపల్లెలో మొత్తం 86 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితమే అంటే.. 1970 నుంచే దేశ సేవలో ఉన్నారు. పెద్దవాళ్లు ఉద్యోగ విరమణ చేశాక తమ పిల్లలను సైతం దేశ రక్షణకు అంకితం చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 130 మంది ఆర్మీ జవాన్లు, మాజీ సైనికులు ఉండగా వీరిలో ప్రస్తుతం 80 మంది దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరూ లేదా ఇద్దరు సైనికులుగా సేవలందిస్తుండటం విశేషం. పాకిస్థాన్‌తో జరిగిన పలు యుద్ధాల్లో పాల్గొని తమ సత్తా చాటిన సైనికులు ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ అందులోనూ రాణిస్తున్నారు. మదరసా నిర్వహణ దేశ రక్షణలో రాణిస్తున్న మల్లారెడ్డిపల్లె గ్రామస్తులు తమ మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. తమ మండలంలో ఉర్దూ పాఠశాల, ఉర్దూ ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించుకున్నారు. ప్రైవేటు మదరసా నిర్వహిస్తూ 35 మంది విద్యార్థులకు ఉర్దూను నేర్పిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. సైన్యంలో 23 ఏళ్లపాటు విధులు నిర్వహించా.. 1981లో ఆర్మీలో జవానుగా చేరి 23 ఏళ్లపాటు విధులు నిర్వహించాను. కార్గిల్ యుద్ధంతోపాటు పలు యుద్ధాల్లో పాల్గొన్నా. – షేక్ మహబూబ్, మాజీ సైనికుడు 1971 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నా 1970లో ఆర్మీలో చేరాను. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడాను. ఆర్మీలో 24 ఏళ్లపాటు విధులు నిర్వహించి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నా. నా ముగ్గురు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు. – షేక్ మదార్ వలి, మాజీ సైనికుడు నా ఇద్దరు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు.. భారత సైన్యంలో 17 ఏళ్లపాటు జవాన్‌గా విధులు నిర్వహించాను. ప్రస్తుతం సైనికులకు గౌరవప్రదమైన వేతనాలు ఇస్తున్నారు. దేశం మీద ప్రేమతో నా ఇద్దరు కుమారులను కూడా ఆర్మీలోనే చేర్పించాను. – ఎం.మహబూబ్ బాషా, మాజీ సైనికుడు -
చెదలు పడుతున్న చరిత్ర
- పర్యాటక శోభను కోల్పోతున్న గుంటి లక్ష్మినరసింహస్వామి ఆలయం - శిలాజాలుగా మారుతున్న శాసనాలు - పట్టించుకోని దేవాదాయశాఖ - ఆలయ అభివృద్ధికి రాజకీయ గ్రహణం - స్వామి వారి ఆస్తులకు రక్షణ కరువాయే ఎంతో చరిత్ర ఉన్న, రాజులు కట్టించిన అతి పురాతన దేవాలయాలను ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ పురాతన దేవాలయ శోభను కోల్పోతుంది. అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఎత్తైన, అతి పురాతన దేవాలయం కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన శ్రీ గుంటి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం దుస్థితిపై ప్రత్యేక కథనం. ఇడమకల్లు (కొమరోలు): కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన గుంటి లక్ష్మినరసింహ స్వామి దేవాలయాన్ని 15వ శతాబ్దపు కాలంలో విద్యారణ్య స్వాముల వారి పోద్బలంతో హిందు మతోద్దరణకు హరిహరరాయులు , బుక్కరాయులు దేవాలయాన్ని నిర్మించారు. 30 సంవత్సరాల కిందట వరకు కూడా ఈ దేవాలయం పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు విరుద్ధం. ఆ దేవాలయంలో మూలవిరాట్ అయిన గుంటి లక్ష్మినరసింహ స్వామి శిలా ప్రతిమను దొంగలు తవ్వి అందులో ఉన్న బంగారాన్ని అపహరించి శిలను మాత్రం అక్కడే పడవేసి వెళ్లిపోయారు. ఆ తరువాత శిలాశాసనం, ధ్వజ స్తంభాన్ని కూడా వదలలేదు. వాటిని కూడా తవ్వకాలు జరిపారు దొంగలకు భారీగా బంగారు నిల్వలు దొరికినట్లు స్థానికులు తెలుపుతున్నారు. అతి పురాతన దేవాలయం కావటం, దేవాలయం రాజుల నాటివి కావడంతో భద్రత కరువైందని ప్రజలు, భక్తులు వాపోతున్నారు. చెక్కు చెదరని శాసనాలు: ఈ ప్రాంత దేవాలయాల్లోకెల్లా అతి పురాతనమైంది గుంటి లక్ష్మినరశింహస్వామి దేవాలం. దేవాలయం ఎత్తైన కొండ మీద ఉండటంతో ఆ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఇంకో విశేషమేమిటంటే కొండ మీద పకృతి సహజసిద్ధంగా వెలసిన ఎత్తైన ఒంటి రాయి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ ప్రతి శనివారం ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొండపైన 15వ శతాబ్ధపు శిలా శాసనం కూడా ఉంది. రాజులు తయారుచేసిన శాసనాలను గతంలో పురావస్తుశాఖ వారు పరిశీలించేందుకు ఇక్కడి నుంచి కర్నూలుకు శాసనాలు ఉండే రాళ్లను తరలించారు. ఈ దేవాలయానికి కావల్సిన సాగు భూమి దాదాపు 30 ఏకరాలు ఉందని ఆ భూముల సర్వేనెంబర్లు వున్న అవి ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకొచ్చినా రాజకీయ కారణాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి. పట్టించుకోని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులు: గుంటి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని గ్రామస్తులు టీటీడీని ఆశ్రయించి దేవాలయాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. అప్పటి గ్రామ పెద్ద లింగరాజు రామయోగీశ్వర రావు అప్పటి టీటీడీ ఈఓ రమణాచారికి వినతిపత్రం ఇచ్చినా అక్కడి నుంచి ముందుగా ఎండోమెంట్ అనుమతి తీసుకున్న తర్వాతే టీటీడీ దత్తత తీసుకుంటామని తేల్చి చెప్పారు. గ్రామస్తులు అందరూ కలిసి మార్కాపురం ఎండోమెంట్ అధికారికి సమాచారం ఇచ్చారు. దానికి వారి నుంచి స్పందన కరువైంది. అతిపురాతన దేవాలంయం శిథిలమైపోతున్నా మన దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ దేవాలయానికి చెందిన భూమిని కొందరు మహానుభావులు ఆక్రమించుకొంటున్నారు. దేవాలయానికి ఉన్న భూములు ఎక్కడ ఉన్నాయే రెవెన్యూ అధికారులైనా తెల్పాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయానికి దొంగల బెడద: గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో దొంగలు గుప్తనిధుల కోసం గర్భగుడి కింది భాగంలోని గుహలో తవ్వకాలు జరుపుతుండగా గబ్బిలాలు బిగ్గరగా అరిశాయి. దీంతో గ్రామస్తులు అనుమానంతో ఆలయం వద్దకు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. ఇలాంటి తవ్వకాలు తరచూ జరుపుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. రాజులు ప్రతిష్ఠిచిన శిలలు, శాసనాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆలయంలో రక్షణ ఏర్పాట్లను చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయానికి ధర్మకర్త గా వ్యవహరిస్తున్న మాజీ సర్పంచ్ బొంతా శేషారెడ్డి బంధువులు, గ్రామస్తులు కలసి గర్భగుడిలో దొంగలు పెకిలించిన లక్ష్మినరసింహస్వామి శిలా విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మళ్లీ పూజలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ వారు, తిరుపతి–తిరుమల దేవస్థానం అధికారులు ఈ దేవాలయాన్ని స్వాధినం చేసుకొని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. శాశ్వత పూజారితో పూజలు నిర్వహించాలి: మా దేవాలయాన్ని టీటీడీ దత్తత తీసుకొని అభివృధ్ధి చేయాలి. ఆలయంలో దేవాదాయశాఖ ద్వార నిత్యం పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాలి. - బి. శేషారెడ్డి, మాజీ సర్పంచ్ పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి: పురాతన దేవాలయమైన గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి. దేవాలయానికి ఉన్న భూములను గుర్తించి దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలి. ఆలయ భద్రతను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. - హెచ్. సార్వభౌమరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ -
విధులకు వెళ్తూ ఆర్మీ జవాను మృతి
* తమ్ముడ్ని కోల్పోయిన బాధతో ప్రాణాలు విడిచిన అక్క * ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో విషాదం కొమరోలు: సెలవులకు ఇంటికి వచ్చిన ఆర్మీ జవాను తిరిగి విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ గుండెపోటుతో మరణించాడు. ఆ వార్త తెలుసుకున్న అతడి సోదరి గుండెలవిసేలా రోదించి ప్రాణాలొదిలింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచే సుకుంది. కొమరోలు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఇసుకల రవి (35) 15 ఏళ్ల నుంచి ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెలలో సెలవులపై ఇంటికి వచ్చాడు. భారత్- పాక్ సరిహద్దులో యుద్ధ వాతారణం నెలకొన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరయ్యేందుకు రవి బుధవారం బయల్దేరాడు. విజయవాడ సమీపంలో గుండెనొప్పి రావటంతో కారులోనే ఉన్న బంధువులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే మృతి చెందాడు. గురువారం ఉదయం భౌతిక కాయూన్ని స్వగ్రామం కొమరోలుకు తీసుకొచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి అక్క సత్వేలి విజయకుమారి(40) బోరున విలపిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయకుమారికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
బస్సు బోల్తా : 30 మందికి గాయాలు
-
బస్సు బోల్తా : 30 మందికి గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి... బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
ప్రకాశంలో రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముత్రాసుపల్లి సమీపంలో బుధవారం జరిగిన రెండు ప్రమాదాలలో ఒకరు చనిపోగా...మరో 10 మంది గాయపడ్డారు. ముత్రాసుపల్లి సమీపంలో జాతీయరహదారిపై అర్థరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... రహదారిపై పక్కనే ఆగిన ఉన్న సదరు లారీని ఈ రోజు తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని కొట్టేశారు !
కొమరోలు (ప్రకాశం) : దొంగలు రహదారిపై ఆగి ఉన్న లారీలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉంచిన లారీని శనివారం అర్ధరాత్రి తర్వాత దొంగలు మాయం చేశారు. ఆదివారం ఉదయం దాని యజమాని సంగు బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. మండలంలోని గోనెపల్లి వద్ద వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో లారీని గుర్తించారు.. కానీ, దొంగలు లారీని మాత్రం వదిలిపెట్టి దాని టైర్లు, బ్యాటరీ, డీజిల్, ఇతర ముఖ్యమైన పరికరాలన్నింటితో ఉడాయించారు! -
రేషన్ షాపు డీలర్‌పై కేసు
అనంతపురం: అనంతపురం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ రేషన్ షాపు డీలర్ రవిపై అధికారులు మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. దుకాణంలో ఉండాల్సిన బియ్యం 37 క్వింటాళ్లకు బదులు ఒక క్వింటా, చక్కెర ఒకటిన్నర క్వింటాళ్లకు బదులు 20 కిలోలు, కిరోసిన్ 199 లీటర్లకుగాను అసలేమీ నిల్వ లేకపోవటాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా చంద్రన్న కానుకలో భాగంగా లబ్దిదారులకు ఇవ్వాల్సిన 231ప్యాకెట్లకు గాను 168 మాత్రమే ఉన్నాయి. ఇందుకుగాను రవిపై నిత్యావసరాల చట్టం కింద 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో గిద్దలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతీబాయి, వీఆర్వో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న బైక్
కొమరోలు (ప్రకాశం జిల్లా) : రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ డీసీఎం వ్యానును వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అండగా ఉంటాం
కొమరోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడతామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన గిద్దలూరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు హాజరయ్యారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామనడానికి సిగ్గుండాలన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. పశ్చిమ ప్రాంత వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించాను..ఏడాదిలోపు పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో కేవలం రూ.70 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టి వేలకోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయనే బతికుంటే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. వెలిగొండ సొరంగ మార్గం పూర్తికావాలంటే 14 నెలల సమయం పడుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తికావాలంటే 5 నుంచి 7 వేల కోట్ల రూపాయల నిధులను వచ్చే బడ్జెట్లోనైనా మంజూరు చేసేలా జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తామని వైవీ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరులను రాజధానికి అనువైన ప్రాంతాలుగా సూచిస్తే ఆ విషయాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ మంత్రులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి గానీ, ఎమ్మెల్యేలుగానీ పెదవి విప్పలేదని విమర్శించారు. జిల్లాలో రూ.5,600 కోట్ల వ్యవసాయ, రూ.1800 కోట్ల డ్వాక్రా రుణాలను చేస్తామని చెప్పి రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులను మోసం చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ ఇచ్చినా అప్రజాస్వామికంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పశ్చిమ ప్రాంతవాసిగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అధికారాన్ని దగ్గరలో కోల్పోయామని కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దన్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజాసమస్యల కోసమే పోరాడుతున్నారన్నారు. అసెంబ్లీలో జగన్‌ను నిలువరించేందుకు టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పింఛను కమిటీల్లో సామాజిక కార్యకర్తలుగా పచ్చచొక్కా కార్యకర్తలను నియమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లోని అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపులో కృషిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలియని చంద్రబాబు నిజస్వరూపం వంద రోజుల్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి ప్రస్తుతం ఉన్న సీట్లలో సగం కూడా రావని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ బండారు వెంకట లక్షమ్మ, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, మాజీ సమితి అధ్యక్షుడు ముత్తుముల భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యువజన సంఘం కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ముత్తుముల రమణారెడ్డి, వాణిజ్య విభాగం నాయకుడు క్రాంతికుమార్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో 15మందికి గాయాలు
ఒంగోలు : ప్రయివేట్ బస్సు డ్రైవర్లు అర్హత, అనుభవం లేకుండా వాహనాలను నడుపుతూ ప్రయాణీకుల ప్రాణం మీదకు తెస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ప్రయివేటు బస్సు ప్రమాదానికి గురైంది. కాణిపాకం నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సు కొమరోలు మండలం పొట్టిపల్లి దగ్గర ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును నడపటం వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణీకుల కేకలు విన్న సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ప్రయాణీకులను శ్రీకాకుళం జిల్లా రాజంకు చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు. -
కాండ్లవాగులో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కొమరోలు, న్యూస్‌లైన్ : మండలంలోని సూరవారిపల్లి గ్రామ సమీపంలో కాండ్లవాగులో 16 మంది విద్యార్థులు కొట్టుకుపోగా వారిలో 13 మందిని స్థానికులు, అధికారులు కాపాడారు. వాగులో గల్లంతైన మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే... మండలంలోని సూరవారిపల్లి, పోసుపల్లి, బోడ్డువానిపల్లి, రామవారిపల్లి గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు కొమరోలులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వారంతా కళాశాలలకు వెళ్లారు. అనంతరం తిరిగి గ్రామాలకు చేరుకునేందుకు 16 మంది విద్యార్థులు ఓ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో సూరవారిపల్లి సమీపంలోని పెద్ద బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి అవతలివైపే ఆటోను డ్రైవర్ నిలిపివేశాడు. ఇంకా ఆలస్యమైతే వాగు ఉధృతి మరింత పెరుగుతుందని, ఎలాగోలా వాగుదాటితే త్వరగా ఇళ్లకు చేరుకోవచ్చని విద్యార్థులు భావించారు. ఆ ఉద్దేశంతో 16 మంది విద్యార్థులు వాగుదాటుతుండగా మధ్యలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అందరూ కొట్టుకుపోయారు. వారిలో 11 మంది విద్యార్థులు దగ్గరలోనే ఉన్న కంపచెట్లను గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు వాగులో అరకిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడున్న చెట్ల మధ్యలో చిక్కుకున్నారు. సమాచారం అందుకుని వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఎసై్స రామానాయక్, తహసీల్దార్ పన్నిక మధుసూదనరావులు స్థానికులతో కలిసి తాళ్లసాయంతో వారిద్దరినీ రక్షించారు. ఎసై్స రామానాయక్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాగులో ఈదుకుంటూ వెళ్లి ఇద్దరు విద్యార్థులనూ తాళ్లసాయంతో ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ముగ్గురు విద్యార్థులు మాత్రం వాగులో గల్లంతయ్యారు. వారిలో కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మండలంలోని పోసుపల్లి గ్రామానికి చెందిన పన్నింగి పీరాంబీ, గొడుగు పీరాంబీ, గిద్దలూరు శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న బొడ్డువానిపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసులు ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం ఆర్డీఓ రాఘవరావు, డీఎస్పీ జి.రామాంజనేయులు సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
కొమరోలులో జర్నలిస్టులు, విద్యార్థులు భారీ ర్యాలీ
ప్రకాశం: జిల్లాలోని కొమరోలులో సమైక్యాంధ్రాకు మద్దతుగా జర్నలిస్టులు, విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నిరసన జ్వాలలు ఎనిమిదో రోజు కూడా యధాతథంగానే కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలోని పలుచోట్ల సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి తోడుగా విద్యార్థులు పాదం కలపడంతో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.