ఆ ఊరే.. ఒక సైన్యం  | Sakshi Special Story On Mallareddypalli Village In Prakasam district | Sakshi
Sakshi News home page

ఆ ఊరే.. ఒక సైన్యం 

Published Sun, Aug 16 2020 4:08 AM | Last Updated on Sun, Aug 16 2020 8:36 AM

Sakshi Special Story On Mallareddypalli Village In Prakasam district

కొమరోలు: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఆర్మీ జవాన్లు. ఆ ఊరిలో 86 కుటుంబాలు ఉంటే అందులో 130 మంది సైనికులు, మాజీ సైనికులే. వీరంతా ముస్లింలే కావడం మరో విశేషం. ప్రస్తుత కాలంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నా తమ ప్రాధాన్యత మాత్రం దేశ రక్షణకే అంటోంది.. ఈ గ్రామం. ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఊరు మొత్తం దేశసేవకే అంకితమవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ గ్రామమే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె. ఇండియన్‌ ఆర్మీకి వీర సైనికులను అందిస్తున్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. 

ఆయన పేరుతోనే ఊరు.. 
శతాబ్దం కిందట ఈ గ్రామ ప్రాంతానికి మల్లారెడ్డి అనే రైతు వలస వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. దీంతో ఊరిపేరు మల్లారెడ్డిపల్లెగా స్థిరపడిపోయింది. కాలక్రమేణా మల్లారెడ్డి కుటుంబీకులు గ్రామం నుంచి వలస వెళ్లిపోయారు. తర్వాత ముస్లింలు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ముస్లింలు తప్ప మరే సామాజికవర్గానికి చెందినవారు లేరు.  
మల్లారెడ్డిపల్లె గ్రామం వ్యూ   

5 దశాబ్దాల క్రితం నుంచే దేశసేవ.. 
మల్లారెడ్డిపల్లెలో మొత్తం 86 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితమే అంటే.. 1970 నుంచే దేశ సేవలో ఉన్నారు. పెద్దవాళ్లు ఉద్యోగ విరమణ చేశాక తమ పిల్లలను సైతం దేశ రక్షణకు అంకితం చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 130 మంది ఆర్మీ జవాన్లు, మాజీ సైనికులు ఉండగా వీరిలో ప్రస్తుతం 80 మంది దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరూ లేదా ఇద్దరు సైనికులుగా సేవలందిస్తుండటం విశేషం. పాకిస్థాన్‌తో జరిగిన పలు యుద్ధాల్లో పాల్గొని తమ సత్తా చాటిన సైనికులు ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ అందులోనూ రాణిస్తున్నారు.   

మదరసా నిర్వహణ 
దేశ రక్షణలో రాణిస్తున్న మల్లారెడ్డిపల్లె గ్రామస్తులు తమ మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. తమ మండలంలో ఉర్దూ పాఠశాల, ఉర్దూ ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించుకున్నారు. ప్రైవేటు మదరసా నిర్వహిస్తూ 35 మంది విద్యార్థులకు ఉర్దూను నేర్పిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.  

సైన్యంలో 23 ఏళ్లపాటు విధులు నిర్వహించా.. 
1981లో ఆర్మీలో జవానుగా చేరి 23 ఏళ్లపాటు విధులు నిర్వహించాను. కార్గిల్‌ యుద్ధంతోపాటు పలు యుద్ధాల్లో పాల్గొన్నా.  
– షేక్‌ మహబూబ్, మాజీ సైనికుడు 

1971 పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొన్నా 
1970లో ఆర్మీలో చేరాను. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడాను. ఆర్మీలో 24 ఏళ్లపాటు విధులు నిర్వహించి రిటైర్‌ అయ్యాను. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నా. నా ముగ్గురు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు. 
 – షేక్‌ మదార్‌ వలి, మాజీ సైనికుడు 

నా ఇద్దరు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు.. 
భారత సైన్యంలో 17 ఏళ్లపాటు జవాన్‌గా విధులు నిర్వహించాను. ప్రస్తుతం సైనికులకు గౌరవప్రదమైన వేతనాలు ఇస్తున్నారు. దేశం మీద ప్రేమతో నా ఇద్దరు కుమారులను కూడా ఆర్మీలోనే చేర్పించాను.  
– ఎం.మహబూబ్‌ బాషా, మాజీ సైనికుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement