అండగా ఉంటాం | my target is to complete veligonda project : y v subba reddy | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం

Published Mon, Sep 22 2014 1:37 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

my target is to complete veligonda project : y v subba reddy

కొమరోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడతామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన గిద్దలూరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ,  ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు హాజరయ్యారు.

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామనడానికి సిగ్గుండాలన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. పశ్చిమ ప్రాంత వరప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించాను..ఏడాదిలోపు పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు బడ్జెట్‌లో కేవలం రూ.70 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు.

 గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టి వేలకోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయనే బతికుంటే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. వెలిగొండ సొరంగ మార్గం పూర్తికావాలంటే 14 నెలల సమయం పడుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తికావాలంటే 5 నుంచి 7 వేల కోట్ల రూపాయల నిధులను వచ్చే బడ్జెట్‌లోనైనా మంజూరు చేసేలా జిల్లా మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఉద్యమిస్తామని వైవీ స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరులను రాజధానికి అనువైన ప్రాంతాలుగా సూచిస్తే ఆ విషయాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ మంత్రులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి గానీ, ఎమ్మెల్యేలుగానీ పెదవి విప్పలేదని విమర్శించారు. జిల్లాలో రూ.5,600 కోట్ల వ్యవసాయ, రూ.1800 కోట్ల డ్వాక్రా రుణాలను చేస్తామని చెప్పి రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులను మోసం చేస్తున్నారన్నారు.

 జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ ఇచ్చినా అప్రజాస్వామికంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు.  పశ్చిమ ప్రాంతవాసిగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ  అధికారాన్ని దగ్గరలో కోల్పోయామని కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దన్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజాసమస్యల కోసమే పోరాడుతున్నారన్నారు.

 అసెంబ్లీలో జగన్‌ను నిలువరించేందుకు టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పింఛను కమిటీల్లో సామాజిక కార్యకర్తలుగా పచ్చచొక్కా కార్యకర్తలను నియమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌లోని అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపులో కృషిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలియని చంద్రబాబు నిజస్వరూపం వంద రోజుల్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి ప్రస్తుతం ఉన్న సీట్లలో సగం కూడా రావని జోస్యం చెప్పారు.

 కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ బండారు వెంకట లక్షమ్మ, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, మాజీ సమితి అధ్యక్షుడు ముత్తుముల భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యువజన సంఘం కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ముత్తుముల రమణారెడ్డి, వాణిజ్య విభాగం నాయకుడు క్రాంతికుమార్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement