నత్తకు మేనత్త! | Veligonda Project Works Pending Prakasam | Sakshi
Sakshi News home page

నత్తకు మేనత్త!

Published Tue, Aug 14 2018 10:43 AM | Last Updated on Tue, Aug 14 2018 10:43 AM

Veligonda Project Works Pending Prakasam - Sakshi

వెలిగొండ ప్రాజెక్టు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. టన్నెల్‌ పనులతో పాటు కాలువ పనులు, భూ సేకరణ, పునరావాసం సైతం ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయాయి. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టు పనులు అడుగు ముందుకు పడలేదు. దీంతో వెలిగొండ నీళ్లు కలగానే మారాయి. పశ్చిమ ప్రాంతంలో పంటల సంగతి దేవుడెరుగు గుక్కెడు నీరందక ప్రజల గొంతులెండుతున్నాయి. ఫ్లోరైడ్‌ నీటి పుణ్యమా కిడ్నీ వ్యాధులతో వందలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి సీఎం చంద్రబాబు, ఆయన వందమాగదులకు మళ్లీ వెలిగొండ గుర్తుకొచ్చింది. ఇదిగో నీళ్లిస్తాం..  అదిగో నీళ్లిస్తామంటూ ప్రచారం మొదలెట్టారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రజలకు తెలియచెప్పడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగవంతం కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రకు సిద్ధమైంది. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది. ఆగస్టు 15న కనిగిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి 


ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. 15 రోజులకు పైగా కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం, నియోజకవర్గాల్లో 207 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభం సందర్భంగా కనిగిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నేతలే కాక పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు.
   
ప్రాజెక్టు ఉద్దేశం ఇదీ..
శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా నీటిని మల్లించి ప్రకాశం జిల్లాలోని 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాసిరెడ్డినాయన మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం, మర్రిపాడు తదితర మండలాల పరిధిలో 84,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 15.25 లక్షల మందికి తాగునీరును అందించడమే వెలిగొండ ప్రాజెక్టు ఉద్దేశం.

వైఎస్సార్‌ హయంలో అధిక నిధులు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు పనుల కోసం 2004 నుంచి 2009 వరకు రూ.1734.35 కోట్లు కేటాయింపులు చేయగా రూ.1466.46 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన పనులన్నీ వైఎస్‌ హాయంలోనే పూర్తయ్యాయి. బాబు అధికారం చేపట్టాక 5వ బడ్జెట్‌తో కలిపి రూ.1208.4 కోట్లు కేటాయింపులు చేసినట్లు చెబుతున్నా ఆ నిధుల్లో కొంత మేర మాత్రమే ఖర్చు చేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.2,634 కోట్లు అదనంగా పెంచుకొని అటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు ప్రజాధనం దోపిడీకి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లు కోట్లు కొల్లకొట్టడంతో చూపిస్తున్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి.

నీటి విడుదలపై పూటకోమాట...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ముగిసింది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. టన్నెల్‌ పనులు మూడు నెలలుగా పూర్తిగా నిలిచి పోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 నాటికి కూడా టన్నెల్‌–1 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 2016 చివరి నాటికే తొలుత వెలిగొండ నీళ్ళిస్తామన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మాట మార్చి 2017, 2018 డిసెంబర్‌కు తాజాగా 2019 సంక్రాంతి అంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే    ఫేజ్‌–1 పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి మాట నెరవేరే పరిస్థితి లేదు. నత్తనడకన జరుగుతున్న పనులను చూస్తే నిర్దేశిత గడువుకు ఫేజ్‌–1 పనులు పూర్తి కావడం కలే.

పునరావాసం దోపిడీ..
వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియా, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపుకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement