సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు మాట మార్చారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని చాలా కాలంగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి శుక్రవారం వెలిగొండను సందర్శించిన అనంతరం ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. అది సాధ్యం కాకపోతే లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేస్తామని కొత్తపల్లవి అందుకున్నారు. ఈలెక్కన ఫిబ్రవరికి పనులు జరిగే పనికాదన్న విషయం బాబు చెప్పకనే చెప్పినట్‌లైంది. విశేషం ఏమిటంటే ఏప్రిల్ నెలలో ఆగిపోయిన టన్నెల్ నిర్మాణ పనులు ముఖ్యమంత్రి వచ్చే నాటికి ప్రారంభం కాలేదు. మరో నెల రోజులకు కూడా పనులు మొదలయ్యే పరిస్థితి లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వెలిగొండను బాబు సర్కారు గాలికి వదిలినట్లే లెక్క. పశ్చిమ ప్రాంతంలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. దీంతో ఈ ప్రాంతంపై చంద్రబాబుకు అక్కసు ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు సాగు, తాగునీరు లేక అష్ట కష్టాలు పడుతున్నా బాబు సర్కారుకు కనికరం కలగలేదు. పలుమార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు జిల్లావాసులు తనకు సహకరించలేదని బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన బాబు మరుసటి ఏడాది వెలిగొండ నీరిస్తానని పేరుకు ప్రకటించినా పనుల సంగతి గాలికొదిలారు.
అంచనాలు పెంచుకుని దాదాపు రూ.3 వేల కోట్లు కొల్లగొట్టినా పనులు మాత్రం వేగవంతం చేయలేదు. ఇప్పటికి టన్నెల్ 1లో మూడు కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉండగా టన్నెల్ 2లో 8 కిలోమీటర్ల పనులు అలాగే ఉండిపోయాయి. ఇక ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులు ఇటీవలే మొదలైనా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి వెలిగొండ పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పడం తప్ప పనులు వేగవంతం చేసిన పాపాన పోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. కాంట్రాక్టర్ల మార్పుతో టన్నెల్ పనులు ఏప్రిల్ నెలలోనే ఆగిపోయాయి. కొత్త కాంట్రాక్టర్లు వచ్చినా పనులు మొదలు పెట్టలేదు. తీరా ఎన్నికల ఏడాది వచ్చేసరికి బాబుకు వెలిగొండ గుర్తొచ్చింది. పశ్చిమ ప్రాంతవాసులు ఓట్లు, సీట్లు అవసరమొచ్చాయి. ఇప్పుడు వెలిగొండ పూర్తి చేస్తానంటూ బాబు మరోమారు జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నానికి దిగారు. నిన్న మొన్నటి వరకు జనవరి, సంక్రాంతికి నీరిస్తానని చంద్రబాబు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆగిపోయిన పనులు మొదలు కాలేదు. పోలవరం తరహాలో ప్రతినెలా వెలిగొండ పై రివ్యూ చేసి పనులు పూర్తి చేస్తానని బాబు గొప్పగా చెప్పినా దాని ఊసేలేదు. ఎట్టకేలకు శుక్రవారం చంద్రబాబు వెలిగొండను సందర్శించారు.
కనీసం ముఖ్యమంత్రి వచ్చే సమయానికైనా పనులు మొదలవుతాయని ఆశించారు. కానీ పనులు మొదలు కాలేదు. బాబు వచ్చి వెలిగొండ టన్నెల్ చూడడం మినహా చేసిందేమీ లేదు. త్వరలో పనులు పూర్తి చేసి ఫిబ్రవరికి నీరిస్తానని చంద్రబాబు పైకి చెప్పినా ఆ మాటపై ఆయనకే నమ్మకం లేదు. అందుకే బాబు తరహాలో ఫిబ్రవరికి పనులు పూర్తికాకపోతే లిఫ్ట్ ద్వారా అయినా నీరిస్తానని మాటదాటేశాడు. బాబు చెప్పినట్లు లిఫ్ట్ ద్వారా నిరివ్వాలన్నా టన్నెల్ 1 పనులతో పాటు, హెడ్‌రెగ్యులేటర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. టన్నెల్ 1లో ఇంకా మూడు కిలోమీటర్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికి పనులు మొదలు కాలేదు. మొదలయ్యేందుకు మరో నెల పైనే పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ పనులు మొదలైనా సగటున రోజుకు 10 మీటర్లకు మించి పని జరిగే పరిస్థితులు లేవు. ఈ లెక్కన మరో పది నెలలు విరామం లేకుండా పనిచేసిన టన్నెల్ 1 పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇప్పటికి 80 శాతం హెడ్ రెగ్యులేటర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గితే తప్ప ఆ పనులు పూర్తయ్యే పరిస్థితులు లేవు. ఈ లెక్కన యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా ఏడాది ముగిసే నాటికి టన్నెల్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు సైతం ముగుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెలిగొండ పనులు, నీరంటూ చంద్రబాబు మరోమారు ప్రకాశం జిల్లా ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment