సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగేళ్లుగా అధికారంలో ఉండి వెలిగొండ పనలను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతికి వెలిగొండ నీరిస్తానంటూ పశ్చిమ ప్రాంతవాసులను వంచిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఒంగోలులో సాక్షితో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కనీసం మూడు కిలో మీటర్లు కూడా వెలిగొండ టన్నెల్ తవ్వలేదని, వచ్చే 5 నెలల్లో మూడున్నర కిలోమీటర్ ఎలా తవ్వుతారని బాలినేని ప్రశ్నించారు. జిల్లా వాసులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు.
వెలిగొండ టన్నెల్ పనులు నిలిచి పోయి మూడు నెలలు దాటుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు వెలిగొండ పనులంటూ హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసిన అధికార పార్టీ నేతలు వెలిగొండకు వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత నేత వైఎస్ హయాంలోనే60 శాతానికి పైగా వెలిగొండ పనులు పూర్తి చేశారన్నారు. వైఎస్ మరణంతోనే వెలిగొండ పనులు నిలిచి పోయాయన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు వెలిగొండ ప్రాజెక్టు పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలియచెప్పడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ పాదయాత్ర చేపట్టిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి నీరిస్తామని బాలినేని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment