తర్లుపాడు సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పక్కన ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల, పార్టీ నాయకుడు హనుమారెడ్డి
తర్లుపాడు (ప్రకాశం): చంద్రబాబు రాక్షస పాలనను తరిమికొడదామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ చేపట్టిన ప్రజా పాదయాత్ర ఐదో రోజు ఆదివారం మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని తర్లుపాడు, మార్కాపురం, కంభం మండలాల్లో 15 కి.మీల మేర సాగింది. ఐదో రోజు తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులతో పాదయాత్రలో వెంట నడిచారు. తర్లుపాడులో వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ సర్పంచ్ సూరెడ్డి రామ సుబ్బారెడ్డి అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే ఏడాది లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం తరువాత అత్యల్పంగా వర్షపాతం నమోదైన కరువు ప్రాంతంగా ఉన్నది ప్రకాశం జిల్లానేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే 2009 నాటికే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. పాదయాత్రలో గ్రామాల్లో పర్యటిస్తుంటే పొలాలు బీళ్లుగా ఉన్నాయని, ప్రజలు, పశువులు, జీవాలు కూడా నీరు లేక అలమటిస్తున్నాయని, దీనికి కారణం చంద్రబాబేనన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం:
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులను రాజుగా చేయాలన్న నాయకుడు వైఎస్సారేనని, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని, పేదవాడు బాగుంటే సమాజం బాగుంటుందని భావించిన ఏకైక వ్యక్తి వైఎస్సార్ అన్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో రైతు బాంధవుడయ్యాడని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు గడిచినా ప్రాజెక్టు నిర్మాణానికి ఇంత వరకు ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 70 శాతం పనులు పూర్తి చేసినప్పటికీ, 30 శాతం పనులు నాలుగున్నరేళ్లలో పూర్తి చేయలేకపోవటం ఆ ప్రభుత్వ అసమర్ధత కారణమన్నారు. ప్రజలకు నవరత్నాల పథకాలు అందాలన్నా, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కేపీ కొండారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి వైవీ సుబ్బారెడ్డేనని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమేనని, అప్పట్లో వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి రూ.3,500 కోట్లు మంజూరు చేశారని, ఆయన హయాంలో 14 కి.మీ టన్నెల్ పనులు పూర్తి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వస్తే కరువు వస్తుందని, దీనికి నిదర్శనం ప్రస్తుతం కనిపిస్తున్న బీడు భూములేనన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, చంద్రబాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పచ్చచొక్కాలకు చెట్టు– నీరు కింద దోచి పెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు జగన్‌తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, రైతు సంఘం నాయకులు ఉడుముల కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ముజావర్ల ప్రత్యేక ప్రార్థనలు:
తుమ్మలచెరువు గ్రామంలో యాత్ర ప్రారంభ సమయంలో దర్గాకు చెందిన ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్లుపాడు ఎస్సీ కాలనీలో వైవీ సుబ్బారెడ్డికి కాలనీవాసులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మండల యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్లుపాడు ఎస్సీ కాలనీ, బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్కాపురం మండలం భూపతిపల్లికి సాయంత్రం గం.4 లకు పాదయాత్ర చేరుకుంది. సుమారు 6 కి.మీల మేర సాగిన పాదయాత్ర కంభం మండలంలోకి సాయంత్రం 5 గంటల సమయంలో చేరుకుంది. లింగోజిపల్లి సమీపంలో వైవీ సుబ్బారెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. లింగోజిపల్లి నుంచి సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ కంభం మండలం సూరేపల్లికి రాత్రి గం.6.30కు చేరుకున్నారు. అక్కడ స్థానిక నాయకులతో సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ నాలుగేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలేదని, తాను పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి ముగ్గురు మంత్రులు వచ్చి వెళ్లారని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారే తప్పా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. దారి పొడవునా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వచ్చారు. కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు సాయికల్పనారెడ్డి, యాళ్లూరి వెంకటరెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, విజయవాడ సిటీ ఇన్‌చార్జ్ ఏలం వెంకటేశ్వర్లు, రాష్ట్రనాయకులు డి.శేషారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్నువిజయ, కంభం మండల కన్వీనర్ లాయర్ శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పఠాన్ సుబాన్‌ఖాన్, పిడతల అభిషేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూరేపల్లిలో మహిళలు, వృద్ధులు పలు సమస్యలను వైవీ దృష్టికి తెచ్చారు.పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి:
ప్రస్తుత సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించేలా కృషి చేయాలని తర్లుపాడు, కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల ఉపాధ్యాయులు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ విషయాన్ని పార్టీ మానిఫెస్టోలో పొందుపరచాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment