డ్రైవర్ నిర్లక్ష్యంతో 15మందికి గాయాలు
ఒంగోలు : ప్రయివేట్ బస్సు డ్రైవర్లు అర్హత, అనుభవం లేకుండా వాహనాలను నడుపుతూ ప్రయాణీకుల ప్రాణం మీదకు తెస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ప్రయివేటు బస్సు ప్రమాదానికి గురైంది. కాణిపాకం నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సు కొమరోలు మండలం పొట్టిపల్లి దగ్గర ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును నడపటం వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణీకుల కేకలు విన్న సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ప్రయాణీకులను శ్రీకాకుళం జిల్లా రాజంకు చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు.