చెదలు పడుతున్న చరిత్ర | temple history disappearing in giddaluru, | Sakshi
Sakshi News home page

చెదలు పడుతున్న చరిత్ర

Published Mon, Apr 3 2017 6:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

చెదలు పడుతున్న చరిత్ర

చెదలు పడుతున్న చరిత్ర

- పర్యాటక శోభను కోల్పోతున్న గుంటి లక్ష్మినరసింహస్వామి ఆలయం
- శిలాజాలుగా మారుతున్న శాసనాలు
- పట్టించుకోని దేవాదాయశాఖ
- ఆలయ అభివృద్ధికి రాజకీయ గ్రహణం
- స్వామి వారి ఆస్తులకు రక్షణ కరువాయే


ఎంతో చరిత్ర ఉన్న, రాజులు కట్టించిన అతి పురాతన దేవాలయాలను ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ పురాతన దేవాలయ శోభను కోల్పోతుంది. అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఎత్తైన, అతి పురాతన దేవాలయం కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన శ్రీ గుంటి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం దుస్థితిపై ప్రత్యేక కథనం.

ఇడమకల్లు (కొమరోలు): కొమరోలు మండలం ఇడమకల్లు గ్రామానికి దక్షిణం వైపు వెలసిన గుంటి లక్ష్మినరసింహ స్వామి దేవాలయాన్ని 15వ శతాబ్దపు కాలంలో విద్యారణ్య స్వాముల వారి పోద్బలంతో హిందు మతోద్దరణకు హరిహరరాయులు , బుక్కరాయులు దేవాలయాన్ని నిర్మించారు. 30 సంవత్సరాల కిందట వరకు కూడా ఈ దేవాలయం పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు విరుద్ధం. ఆ దేవాలయంలో మూలవిరాట్‌ అయిన గుంటి లక్ష్మినరసింహ స్వామి శిలా ప్రతిమను దొంగలు తవ్వి అందులో ఉన్న బంగారాన్ని అపహరించి శిలను మాత్రం అక్కడే పడవేసి వెళ్లిపోయారు. ఆ తరువాత శిలాశాసనం, ధ్వజ స్తంభాన్ని కూడా వదలలేదు. వాటిని కూడా తవ్వకాలు జరిపారు దొంగలకు భారీగా బంగారు నిల్వలు దొరికినట్లు స్థానికులు తెలుపుతున్నారు. అతి పురాతన దేవాలయం కావటం, దేవాలయం రాజుల నాటివి కావడంతో భద్రత కరువైందని ప్రజలు, భక్తులు వాపోతున్నారు.

చెక్కు చెదరని శాసనాలు: ఈ ప్రాంత దేవాలయాల్లోకెల్లా అతి పురాతనమైంది గుంటి లక్ష్మినరశింహస్వామి దేవాలం. దేవాలయం ఎత్తైన కొండ మీద ఉండటంతో ఆ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఇంకో విశేషమేమిటంటే కొండ మీద పకృతి సహజసిద్ధంగా వెలసిన ఎత్తైన ఒంటి రాయి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ ప్రతి శనివారం ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొండపైన 15వ శతాబ్ధపు శిలా శాసనం కూడా ఉంది. రాజులు తయారుచేసిన శాసనాలను గతంలో పురావస్తుశాఖ వారు పరిశీలించేందుకు ఇక్కడి నుంచి కర్నూలుకు శాసనాలు ఉండే రాళ్లను తరలించారు. ఈ దేవాలయానికి కావల్సిన సాగు భూమి దాదాపు 30 ఏకరాలు ఉందని ఆ భూముల సర్వేనెంబర్లు వున్న అవి ఎక్కడ ఉన్నయో తెలియని పరిస్థితి. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకొచ్చినా రాజకీయ కారణాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి.

పట్టించుకోని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులు: గుంటి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని గ్రామస్తులు టీటీడీని ఆశ్రయించి దేవాలయాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. అప్పటి గ్రామ పెద్ద లింగరాజు రామయోగీశ్వర రావు అప్పటి టీటీడీ ఈఓ రమణాచారికి వినతిపత్రం ఇచ్చినా అక్కడి నుంచి ముందుగా ఎండోమెంట్‌ అనుమతి తీసుకున్న తర్వాతే టీటీడీ దత్తత తీసుకుంటామని తేల్చి చెప్పారు. గ్రామస్తులు అందరూ కలిసి మార్కాపురం ఎండోమెంట్‌ అధికారికి సమాచారం ఇచ్చారు. దానికి వారి నుంచి స్పందన కరువైంది. అతిపురాతన దేవాలంయం శిథిలమైపోతున్నా మన దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ దేవాలయానికి చెందిన భూమిని కొందరు మహానుభావులు ఆక్రమించుకొంటున్నారు. దేవాలయానికి ఉన్న భూములు ఎక్కడ ఉన్నాయే రెవెన్యూ అధికారులైనా తెల్పాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆలయానికి దొంగల బెడద: గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో దొంగలు గుప్తనిధుల కోసం గర్భగుడి కింది భాగంలోని గుహలో తవ్వకాలు జరుపుతుండగా గబ్బిలాలు బిగ్గరగా అరిశాయి. దీంతో గ్రామస్తులు అనుమానంతో ఆలయం వద్దకు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. ఇలాంటి తవ్వకాలు తరచూ జరుపుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. రాజులు ప్రతిష్ఠిచిన శిలలు, శాసనాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆలయంలో రక్షణ ఏర్పాట్లను చేయాలని భక్తులు కోరుతున్నారు.

దేవాలయానికి ధర్మకర్త గా వ్యవహరిస్తున్న మాజీ సర్పంచ్‌ బొంతా శేషారెడ్డి బంధువులు, గ్రామస్తులు కలసి గర్భగుడిలో దొంగలు పెకిలించిన లక్ష్మినరసింహస్వామి శిలా విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మళ్లీ పూజలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ వారు, తిరుపతి–తిరుమల దేవస్థానం అధికారులు ఈ దేవాలయాన్ని స్వాధినం చేసుకొని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

శాశ్వత పూజారితో పూజలు నిర్వహించాలి: మా దేవాలయాన్ని టీటీడీ దత్తత తీసుకొని అభివృధ్ధి చేయాలి. ఆలయంలో దేవాదాయశాఖ ద్వార నిత్యం పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాలి. - బి. శేషారెడ్డి, మాజీ సర్పంచ్‌

పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి: పురాతన దేవాలయమైన గుంటి లక్ష్మినరసింహస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి. దేవాలయానికి ఉన్న భూములను గుర్తించి దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలి. ఆలయ భద్రతను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. - హెచ్‌. సార్వభౌమరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement