ఒంగోలు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముత్రాసుపల్లి సమీపంలో బుధవారం జరిగిన రెండు ప్రమాదాలలో ఒకరు చనిపోగా...మరో 10 మంది గాయపడ్డారు. ముత్రాసుపల్లి సమీపంలో జాతీయరహదారిపై అర్థరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... రహదారిపై పక్కనే ఆగిన ఉన్న సదరు లారీని ఈ రోజు తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.