
మీ పొలం బంగారం గాను..
♦ అనంతపురం జిల్లా ఉప్పరపల్లి వద్ద బంగారు నాణేలు లభ్యం
♦ ఎండలోనూ నాణేల వేటలో జనం
♦ కొనుగోలుకు బంగారు వ్యాపారుల క్యూ
అనంతపురం రూరల్: ఆ గ్రామం వద్ద వెతుకున్న వారికి వెతుకున్నన్ని బంగారు నాణేలు లభిస్తున్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా?! అవును ఇది నిజమే. గ్రామస్తులు రోజూ పిల్లాపాపలతో పొలంలోకి వెళ్లి బంగారు నాణేలను అన్వేషిస్తున్నారు. సాయంత్రానికి బంగారు వ్యాపారులు కూడా కొనుగోలు కోసం ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ గ్రామమే అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి. గ్రామానికి చెందిన కురుబ బిల్లే రాముడు పొలంలో నెల కిందట ఓ వ్యక్తికి బంగారు నాణేలు దొరికాయి. ఈ విషయం తెలిసి మిగిలిన వారూ అన్వేషణ మొదలుపెట్టారు.
గుంపులు గుంపులుగా వెళ్లి.. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా నాణేల వేటలో నిమగ్నమవుతున్నారు. ఒక అడుగు లోతు తవ్వితే చాలు 2 నుంచి 3 గ్రాముల బరువు ఉన్న బంగారు నాణేలు బయట పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అనంతపురం పాతవూరుకు చెందిన బంగారం వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేయడానికి గ్రామం బాట పడుతున్నారు. రోజూ 60 నుంచి 70 నాణేలను గ్రామస్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో నాణేన్ని వ్యాపారులు రూ.3,500కు కొంటున్నారు. నాణేలపై ఒకవైపు దేవతా ప్రతిమలు, మరోవైపు శాసన లిపి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో రాజులు బస చేసేవారని, అందుకే బంగారు నాణేలు లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
నాణేలు దొరుకుతున్నది వాస్తవమే
ఉప్పరపల్లిలో బంగారు నాణేలు దొరుకుతున్న మాట వాస్తవమే. అవి కూడా చిన్న పిల్లలకు దొరికినట్లు మా విచారణలో వెల్లడైంది. వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్