’బెంగా’రం
’బెంగా’రం
Published Sat, Jan 21 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
రూ.30 వేలకు చేరువైన పసిడి ధర
నాలుగు రోజుల్లో 10 గ్రాములపై రూ.2 వేల వరకు పెరుగుదల
కిలో రూ.40 వేల మార్క్ దాటిన వెండి
నరసాపురం :
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని ధరలూ తగ్గిపోతాయనే ప్రచారం వెల్లువలా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ తరహా ప్రచారం హద్దులు దాటుతోంది. అందుకు భిన్నంగా.. నోట్ల రద్దు తరువాత ఇప్పటికే రెండుసార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు ఏమాత్రం తగ్గలేదు. భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి ధరాఘాతాల నుంచి నుంచి జనం తేరుకోకుండానే.. బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి వారిని భయపెట్టే విధంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ పసిడి ధరలు నేల చూపులు చూశాయి. త్వరలోనే కాసు బంగారం ధర రూ.15 వేలకు పడిపోతుందనే ప్రచారం సాగింది. ఇప్పుడు అదికాస్తా రివర్స్ అయ్యింది. బంగారం ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.30 వేలకు చేరువైంది. గడచిన నాలుగు రోజుల్లో రూ.2 వేల వరకు పెరిగింది. వెండి సైతం అదే బాటలో పయనిస్తూ కిలో రూ.40 వేల మార్కును మళ్లీ దాటేసింది. శనివారం ట్రేడింగ్ ముగిసేసరికి నరసాపురం హోల్‌సేల్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.29,500, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు రూ 27,500కు పెరిగాయి. అంటే కాసు (8 గ్రాములు)బంగారం రూ.22 వేలకు చేరింది. కిలో వెండి 41,700 వద్ద ట్రేడయ్యింది. ధరలు దిగిపోతాయని ఊహించిన వారందరికీ షాక్ తగిలింది. అమెరికా «అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్టించడం, షేర్ మార్కెట్‌లో ఒడిదుడుకుల నేపథ్యంలో మదుపరులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గడం వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అమ్మకాలు డౌన్ ట్రెండ్
నోట్ల రద్దు దెబ్బతో అమ్మకాలు లేక వెలవెలబోతున్న ఆభరణాల దుకాణాలు ధరల పెరుగుదల కారణంగా ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది. సంక్రాంతి సీజన్‌లోనూ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. నగదు లభ్యతలేక పోవడంతో అమ్మకాలు పూర్తిగా పడకేశాయి. ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు పెద్ద ఆశాజనకంగా ఉండకపోవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇదేవిధంగా కొనసాగితే పేద, మధ్య తరగతి వర్గాలు బంగారం జోలికి వెళ్లే పరిస్థితి ఉండదంటున్నారు. ఆభరణాల అమ్మకాలు తగ్గడంతో ఆ ప్రభావం స్వర్ణకారులపైనా పడుతోంది. జిల్లాలో ఒకప్పుడు రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ బంగారం అమ్మకాలు ఉండేవి. ప్రస్తుతం రూ.2 కోట్ల మేర కూడా ఉండటం లేదని చెబుతున్నారు.
కొందరికి ఊరట
బంగారం ధరలు పెరుగుతుండటం జిల్లాలో కొందరికి ఊరటనిస్తోంది. నోట్ల రద్దుకు ముందు అధిక ధరకు బంగారం కొనుగోలు చేసిన వారు ధరలు పడిపోవడంతో నష్టపోయారు. జిల్లాలో ఈ రకమైన నష్టం రూ.వందలాది కోట్లలోనే ఉండొచ్చని అంచనా కట్టారు. ధరలు పెరుగుతుండటంతో వారికి కాస్త ఊరట లభించింది. ఇదిలావుంటే.. నోట్ల రద్దు అనందరం నల్లధనాన్ని అప్పుటికప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ వెచ్చింది కొనుగోలు చేసేసారు. ఆ తరువాత ధరలు పడిపోవడంతో చాలావరకూ నష్టపోయామని బెంగపడ్డారు. ఇప్పుడు వారంతా ఆనందంతో ఉన్నారు.
ధరల తగ్గుదల తాత్కాలికమని తేలిపోయింది
బంగారం ధరల తగ్గుదల ఎప్పుడూ తాత్కాలికమే అని మరోసారి తేలిపోయింది. 10 గ్రాముల బంగారం రూ.30 వేలు దాటే అవకాశం కనిపిస్తోంది. బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడే. ప్రస్తుతం ధరలు పెరగడంతో మా వ్యాపారంపై ప్రభావం ఎక్కువగా ఉంది. నోట్ల రద్దుతో ఇప్పటికే వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఈ అమ్మకాలు కూడా జరిగేట్టు కనిపించడం లేదు.
అజిత్‌కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి
అయోమయంగా ఉంది
బంగారం ధరలు అయోమయానికి గురి చేస్తున్నాయి. కొనాలో వద్దో అర్థం కావడంలేదు. మొన్నటివరకూ ధరలు తగ్గిపోయాయి. ఇంకా చాలా వరకూ ధరలు తగ్గిపోతాయన్నారు. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. కాసు, అరకాసు కొనే మాలాంటి వాళ్లకి ఏమీ అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం అర్థమవుతోంది. ఏ ధరలూ తగ్గవని.. పెరుగుతూనే ఉంటాయనే నిజం తెలిసి వచ్చింది.
అనంతపల్లి మహేశ్వరి, గృహిణి, నరసాపురం
Advertisement