గోల్డ్ నీతో కీళ్ల మార్పిడి
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్‌నీతో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన నగరంలోని గౌరి గోపాల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన డాక్యుమెంట్ రైటర్ ఎన్.జ్వాలా నరసింహులు(68) కొంత కాలంగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడన్నారు. ఇటీవల ఆయన తమ ఆసుపత్రికి వచ్చి కలువగా పరీక్షల అనంతరం బుధవారం గోల్డ్ నీ(సెవెన్ లేయర్స్ ఆఫ్ జిర్కోనియం నైట్రేట్ కోటింగ్)తో కీలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. సాధారణంగా చేసే కీళ్ల మార్పిడి ఆపరేషన్‌లో ఉపయోగించే కోబాల్ట్ నికెల్ వల్ల కొంత మందికి అలర్జీ వస్తుందన్నారు. ప్రస్తుతం వినియోగించిన గోల్డ్ నీతో మెటల్ అలర్జీ ఉండదన్నారు. దీని మన్నిక 30 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. హైదరాబాద్ కంటే 50 శాతం తక్కువ ఫీజుతో ఈ ఆపరేషన్ చేశామన్నారు. ఆసుపత్రి వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి రోగులకు ఫ్యామిలీ డాక్టర్‌గా అన్ని రకాల సేవలను అందిస్తోందన్నారు. భవిష్యత్‌లో మరింత అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ టి.జి.భరత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనిరెడ్డి, వైద్యులు లక్ష్మణమూర్తి, ఎండి గౌస్, ప్రవీణ్ పాల్గొన్నారు.