శ్రీశైలేశుడికి స్వర్ణకాంతులు
శ్రీశైలేశుడికి స్వర్ణకాంతులు
Published Mon, Jul 3 2017 10:30 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- రూ.కోటితో అంతరాలయ ద్వారాలకు బంగారు పూత
– ఈఓ భరత్ గుప్త
శ్రీశైలం: భ్రమరాంబామల్లికార్జున స్వామి వార్ల అంతరాలయ ద్వారాలు దాతల సహకారంతో బంగారుమయం కానున్నాయని ఈఓ నారాయణ భరత్ గుప్త సోమవారం తెలిపారు. స్వామి వారి అంతరాలయంలోని రెండు ద్వారాలకు, అమ్మవారి గర్భాలయ ద్వారానికి బంగారు తాపడం చేయనున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని 3 నెలలుగా 230 కేజీల రాగి ఉపయోగించి ద్వార బంధాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాటిపైనున్న మూర్తుల ఆర్నమెంటల్ వర్క్ కూడా పూర్తి చేసి ద్వారాలను ఫిట్ చేసి టెస్టింగ్ చేశామన్నారు. ఇక మిగిలింది మలచిన ఈ రాగి రేకులను చెన్నైకు పంపించి అక్కడ కేజిన్నరకు పైగా బంగారంతో 2.69 మైక్రాన్ల మందంతో బంగారు తాపడం చేసే పని ఉందన్నారు. బహుశా శ్రావణ మాసం మొదటి వారంలో ఈ కార్యక్రమం పూర్తి చేసి సంప్రోక్షణాది పూజలను నిర్వహించి అంతరాలయ ద్వారాలను అమర్చనున్నట్లు చెప్పారు. కాగా మల్లికార్జున స్వామి గర్భాలయ విమాన గోపురం 2007లో స్వర్ణమయం అయిందని, అది పూర్తి అయ్యాక ఆరేళ్లకు అమ్మవారి గర్భాలయ గోపురం సువర్ణ శోభను సంతరించుకుందన్నారు.
Advertisement