– సహజ వనరులను కాపాడుదాం
– డబ్బు కంటే ప్రకృతి సంపద కీలకం
– 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో డీఈఓ
కర్నూలు సిటీ: ప్రయోగాత్మక విద్యతో మంచి భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్‌లో 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో వాతావరణంలో కార్బైన్ డయాక్సైడ్ శాతం పెరిగి పొగమంచు తీవ్రమై స్కూళ్లకు కొద్ది రోజులు సెలవులు ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తు తరాలకు ఆస్తుల కన్నా మెరుగైన సహజ వనరులను, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఐఐటీ, నీట్, ట్రిపుల్‌ఐటీ సీట్లు 3100 మందికి వచ్చాయన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన వారికి రాని సీట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు దక్కడం ప్రతిభకు నిదర్శనమన్నారు. అయితే సీట్లు అయితే సాధిస్తున్నారని, కానీ పరిశోధన చదువులకు మాత్రం చాలా తక్కువ మంది ఎంపిక అవుతున్నారన్నారు. ఇందుకు విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను నిజ జీవితంతో సంబంధం ఉండేటట్లు ప్రయోగాల ద్వారా అభ్యసిస్తేనే రీసెర్చ్ స్డడీస్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల ప్రదర్శనలలో 10 జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. వీరు వచ్చే నెల 3,4 తేదీలో్ల విజయవాడలో నిర్వహించే రాష్థ్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ రాజశేఖర్, అబ్జర్వరర్స్ డీవీఎస్ నాయుడు, మురళీకృష్ణ, సైన్స్ కో–ఆర్డినేటర్లు కేవీ సుబ్బారెడ్డి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రభుత్వ పురుషుల, కేవీఆర్ డిగ్రీ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీలకు చెందిన అధ్యాపకులు వ్యవహారించారు.
రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపిక
జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లాలోని నలుమూలల నుంచి మొత్తం 174 ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 10 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఎంపికైనా వారు..
– బీఎస్. పరహానా, జెడ్పీ హైస్కూల్, ఆత్మకూరు
– బి.సౌమ్య, సిస్టర్ స్టాన్సిలా స్కూల్ కర్నూలు
– ఉషాశ్రీ, గుడ్ షెప్పర్డ్ హైస్కూల్, కర్నూలు
– ఎస్.బాలయ్య, జెడ్పీ హైస్కూల్, బనగానపల్లె
– సి.నరేష్, నెహ్రూ హైస్కూల్, బనగానపల్లె
– జె. చైతన్య నాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్, కర్నూలు
– ఏ.అనన్య రెడ్డి, మాంటిస్సోరి, ఏ క్యాంపు, కర్నూలు
– ఏ.నందిని, కస్తూర్బాగాంధీ విద్యాలయ, సంజామల
– బీవీ. సుమంత్ కూమార్ రెడ్డి, గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల
– పీవీ.సాల్మా, ఇండస్ హైస్కూల్, కర్నూలు