ధైర్యే.. సాహసే.. లక్ష్మి!
తాటిచెట్లపాలెం: రైలు ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో.. అందులో ఉద్యోగం అంత కష్టంగా ఉంటుంది! సాధారణ రైళ్ల సంగతేమో కానీ.. గూడ్సు రైళ్లలో పరిస్థితి మాత్రం ముమ్మాటికీ కష్టమే. ఓ వైపు ఇంజిన్.. మధ్యలో కనీసం రెండు కిలోమీటర్ల దూరాన సరకు రవాణా పెట్టెలు.. ఆపై శివారున గూడ్స్ గార్డు క్యాబిన్. సాధారణ రైళ్లలో మాదిరి పలకరించడానికి కనీసం ఒక్కరు కూడా ఉండరు. పైగా ఎక్‌్సప్రెస్‌లు, సూపర్‌ఫాస్టు రైళ్లు వచ్చేటప్పుడు గూడ్స్ రైళ్లను ఎక్కడబడితే అక్కడ ఆపేస్తుంటారు. అందులోనూ.. రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కువగా ఆపాల్సి ఉంటుంది. గూడ్స్ గార్డు ఉద్యోగం చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలంటారు. అలాంటిది.. ఓ మహిళ ఏరికోరి ఈ ఉద్యోగం ఎంచుకుందంటే ఎంత గట్స్ ఉండాలి! .. వాలే్తరు డివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ.. గూడ్స్‌గార్డు గా బాధ్యతలు స్వీకరించి నూతన శకానికి నాంది పలికింది. ఆమె పేరు యు.హెచ్.మహాలక్ష్మి. భర్త రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి 2011లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమెకు రైల్వేశాఖ ట్రెయిన్స్ క్లర్క్‌గా బాధ్యతలు అప్పగించింది. నాలుగేళ్లపాటు విధి నిర్వహణ లో ఉంటూనే, డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రాసి గూడ్స్ గార్డుగా ఎంపికైంది. ఈ క్రమంలో ఇటీవలే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తిచేసుకుని... గురువారం మార్షలింగ్ యార్డు నుంచి రాయగడకు తన తొలి ప్రయాణానికి పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి సాధించిన విజయాన్ని రైల్వే సిబ్బంది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.