విడిపోయిన కొద్ది రోజుల్లేనే రికార్డు వృద్ధి..
విజయవాడ: ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ వేడుక అని గణతంత్ర దినోత్సవ వేడుకలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నేడు భారతీయులందరికీ గొప్ప పండుగ అని అభివర్ణించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని చెప్పారు. అనంతరం ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు.
రాష్ట్ర విభజన జరిగిన 19 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు వృద్ధిని సాధించిందని చెప్పారు. ఐదు నెలల్లో పట్టి సీమ పూర్తయిందని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ధ్యేయమని చెప్పారు. అన్ని రంగాల్లో సమీకృత అభివృద్ధి సాధించారని చెప్పారు. పంటసంజీవని పేరిట నీటి కుంటల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సులో 4.7లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు స్థాపించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పేద బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు.