ఏవోకి వినతి పత్రాన్ని అందజేస్తున్న రైతు నాయకుడు ప్రభాకర్‌నాయుడు, రైతులు
–శ్రీశైలం నీరు సాగర్‌కు విడుదల దుర్మార్గం
–10 టీఎంసీల నీటి విడుదలపై భగ్గుమన్న రైతులు
–రాయలసీమ సాగునీటి సాధన డిమాండ్
తిరుపతి తుడా: కోస్తా జిల్లాల నీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేయాలనే ప్రభుత్వం నిర్ణయం రాయలసీమ జిల్లాల రైతుల గొంతుకోసేలా ఉందని రాయలసీమ సాగునీటి సాధన నేత, రైతు నాయకుడు ప్రభాకర్‌నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ సాగునీటి సాధన ఆధ్వర్యంలో తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉందన్నారు. జీవో నెంబర్ 69 నిబంధనల ప్రకారం కనీసం 834 అడుగులు నీరు ఉంటేనే కిందికి విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సర్కార్ జిల్లాల ప్రయోజనాల కోసం శ్రీశైలంలో 800 అడుగులు మాత్రమే నీటి మట్టం ఉన్నా, సాగర్‌కు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. సీమ జిల్లాలకు ఇది తీవ్ర అన్యాయం చేయడమేనని తెలిపారు. సీమలో తాగునీటికీ ఇబ్బందులు తప్పవన్నారు. సీమ జిల్లాలకు శ్రీశైలం నుంచి తెలుగు గంగ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా నీరు రావాలంటే కనీసం 842 అడుగుల నీరు ఉండాలన్నారు. ఎత్తిపోతల ద్వారా నీటిని అందించాలంటే 830 అడుగుల నీటి మట్టం తప్పనిసరని తెలిపారు. ప్రభుత్వం ఇవేం పట్టకుండా ఓ ప్రాంతానికి మేలు చేకూర్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సహజ సూత్రాలకు విరుద్ధంగా సీమ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాకుంటే వచ్చేరోజుల్లో సీమ ఎడారిగా మిగిలిపోతుందన్నారు. రాయలసీమ ప్రజలపై కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. పులివెందులకు నీరు ఇస్తాం, కుప్పంకు నెలలో నీరుస్తాం అంటూ ప్రకటనలు చేస్తూ ఇక్కడి ప్రజల గొంతుకోసేలా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని తెలిపారు. పది టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం రైతులతో కలిసి సబ్‌కలెక్టర్ ఏవోకి వినతి పత్రాన్ని అందజేశారు.