పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం
పంటలను ఎండబెడుతున్న ప్రభుత్వం
Published Fri, Aug 19 2016 10:17 PM | Last Updated on Tue, Sep 3 2019 8:50 PM
మచిలీపట్నం
రైతులను నిర్వీర్యం చేసి అనంతరం భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సాగునీరు అందకపోవటంతో బందరు మండలంలో ఎండిపోయిన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తాళ్లపాలెం, జొన్నలవారిమోడి, కానూరు తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఇతర శాసనసభ్యులు ప్రజాధనంతో పర్యటనలు చేస్తున్నారని రైతులకు సకాలంలో సాగునీరు అందించే అంశంపై దృష్టిసారించటం లేదని చెప్పారు. ఆగస్టు నెల పూర్తవుతున్న దశలోనూ రామరాజుపాలెం ప్రధాన కాలువకు నీరు ఇవ్వకపోవటంతో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు చనిపోయిందన్నారు. గత ఎనిమిది నెలలుగా రామరాజుపాలెం కాలువకు చుక్కనీరు విడుదల చేయకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. బందరు మండలంలోని దాదాపు 24వేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 9వ నెంబరు కాలువ ద్వారా నేటికీ నీటిని విడుదల చేయలేదని, కోన గ్రామానికి కాలువ ద్వారా నీరు చేరి దాదాపు ఏడాది గడిచిందన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నారు?
వరిసాగుకు సకాలంలో నీరు ఇవ్వకుంటే రైతులు సాగును వదులుకుంటారని, భూమిపై మమకారాన్ని కోల్పోతారని ఈ నేపధ్యంలో ఇండస్ట్రియల్ తదితర పేర్లతో భూమిని కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాని ధ్వజమెత్తారు. మంత్రి కొల్లు రవీంద్ర కాలువల వెంట నిద్రపోతానని, శివారు ప్రాంతాలకు సాగునీరు అందిస్తానని చెప్పటమే తప్ప చుక్క నీరివ్వలేదని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పంపింగ్ చేస్తున్న నీరు ఎక్కడకు వెళుతోందో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని గండికొట్టి కొల్లేరులోకి పంపుకున్నారని చెప్పారు. మూడు, నాలుగు రోజులు వేచి చూసి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
గొల్లుమన్న అన్నదాతలు
జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుందని వెదజల్లే పద్దతి ద్వారా 40 రోజుల క్రితం వరినాట్లు పూర్తిచేసినట్లు తాళ్లపాలెంకు చెందిన గంగిరెడ్డి తాతయ్య, జొన్నల రామారావు, పాము నాగరాజు, నాగమల్లేశ్వరరావు అనే రైతులు పేర్ని నాని దృష్టికి తీసుకువచ్చారు. ఐదుసార్లు దుక్కులు, విత్తనాల ఖర్చులు, కలుపు నివారణ తదితరాలు కలిపి ఎకరానికి రూ. 7వేలకు పైగా ఖర్చు చేశామని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప«థకం ద్వారా 25శాతం పంట బీమాను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కానూరు పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీకాకుళపు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాళ్లపాలెం సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, పుల్లయ్య, పోతిరెడ్డిపాలెం సర్పంచ్ మేకా లవకుమార్, పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు నాగబాబు, చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు గాజుల నాగరాజు పలువురు రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement