దగా పడ్డ రైతన్న
పరిహారం.. మాయాజాలం
- ఇష్టారాజ్యంగా వాతావరణ బీమా వర్తింపు
- ప్రకటించిన మొత్తం కన్నా తక్కువగా బ్యాంకుల్లో జమ
- సమాధానం చెప్పే అధికారులు కరువు
- చేతులెత్తేస్తున్న బ్యాంకర్లు
- కార్యాలయాల చుట్టూ అన్నదాతల చక్కర్లు
వాతావరణ బీమా పథకం మాయాజాలంలో రైతులు దారుణంగా మోసపోతున్నారు. చంద్రబాబు సర్కారు రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే.. కరువు రైతు కన్నీళ్లు తుడిచే విషయంలో ఎలాంటి కనికరం చూపని పరిస్థితి. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు కూడా అన్నదాతకు అండగా నిలిచే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖ.. లీడ్ బ్యాంకు.. జిల్లా అధికార యంత్రాంగం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం రైతులకు శాపంగా మారింది. వాతావరణ బీమా పరిహారం పంపిణీ విషయంలో చోటు చేసుకుంటున్న పొరపాట్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బొమ్మనహాల్, పామిడి, పెద్దవడుగూరు, పుట్లూరు, కనగానపల్లి, గోరంట్ల, బత్తలపల్లి.. ఇలా 40 నుంచి 45 మండలాల్లో ప్రకటించిన మొత్తం కన్నా తక్కువ పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదేమంటే.. ఎంత వచ్చిందో అంతే జమ చేశామంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.
బీమా పథకం ఎంత లోపభూయిష్టంగా అమలవుతుందనేది గత ఆరేళ్లుగా మంజూరైన పరిహారాన్ని చూస్తే అర్థమవుతోంది. బజాజ్ అలయెంజ్ కంపెనీ నుంచి మండలాల వారీగా వాతావరణ బీమా పరిహారం మంజూరు జాబితాను జూన్ 18న వ్యవసాయశాఖ అధికారులు విడుదల చేశారు. ఆ ప్రకారం 5,07,658 మంది రైతులకు రూ.419.05 కోట్ల పరిహారం మంజూరయింది. రైతుల వాటాతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద బజాజ్ కంపెనీకి ప్రీమియం కింద రూ.280 కోట్లు జమ అయ్యాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల 80 నుంచి 90 శాతం మేర పంట నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నా.. బీమా పథకం కింద కేవలం రూ.419 కోట్లు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
కనీసం ప్రకటించిన మొత్తమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. చాలా మండలాల్లో రైతులకు అత్తెసరు పరిహారం జమ అవుతోంది. అత్యధికంగా గోరంట్ల మండలంలో 9,684 మంది రైతులకు రూ.20.45 కోట్లు ఇచ్చారు. ఇక్కడ హెక్టారుకు రూ.14,633 వర్తింపజేశారు. అంటే ఎకరాకు రూ.5,853 ప్రకారం రైతులకు జమ చేయాలి. అత్యల్పంగా వచ్చిన చెన్నేకొత్తపల్లి మండలాన్ని తీసుకుంటే ఇక్కడ హెక్టారుకు రూ.1,679 అంటే ఎకరాకు రూ.670 ప్రకారం వర్తింపజేశారు. అగళి, అమరాపురం, బొమ్మనహాల్, చిలమత్తూరు, గోరంట్ల, హిందూపురం, కదిరి, కంబదూరు, నల్లచెరువు, నల్లమాడ, ఓడీ చెరువు, పరిగి, పుట్టపర్తి, రొళ్ల, తలుపుల, తనకల్లు తదితర 23 మండలాల రైతులకు కొంత బాగానే పరిహారం ఇచ్చినట్లు కనిపిస్తున్నా.. మిగతా 40 మండలాలకు ముష్టి వేసినట్లు దారుణమైన పరిహారం వర్తింపజేయడం గమనార్హం.
ఫిర్యాదు చేస్తే న్యాయం
తక్కువ పరిహారం జమ చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. బీమా కంపెనీ నుంచి విడతల వారీగా పరిహారం జమ కావడం వల్ల రైతుల ఖాతాల్లో వేయడానికి కొంత ఆలస్యమవుతోంది. ఫిర్యాదులు వస్తే పరిశీలించి న్యాయం చేస్తాం.
- ఎల్.జయశంకర్, ఎల్‌డీఎం