ఉల్లి, టమాట రైతుల గోడు పట్టదా?
అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే గౌరుచరిత
కల్లూరు (రూరల్): గిట్టుబాటు ధర లేక ఉల్లి, టమాట రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓ వైపు తీవ్ర వర్షాభావం..మరోవైపు గిట్టుబాట ధర లేక రైతన్నలు కన్నీరు పెడుతున్నారన్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెయిన్ గన్లు, ఆయిల్ ఇంజిన్లు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్‌లో ఉల్లి, టమాట రైతులను వ్యాపారులు మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు వారికి చేసిందేమీ లేదన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కరువు మండలాలను ప్రకటించి ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం అందించలేదన్నారు. రైతులు పండించిన ఉల్లి, టమటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఉల్లి పంటను వ్యాపారులు మార్కెట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం మాట్లాడుతూ ఉల్లి క్వింటానికి రూ.2వేలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. శేషఫణి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కష్ణా పుష్కరాలపై ఉన్న శ్రద్ధ రాయలసీమ రైతుల కష్టాలపై లేదన్నారు. హంద్రీ పరివాహక పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం. రామకష్ణారెడ్డి మాట్లాడుతూ ‡ ప్రభుత్వం కార్పొరేట్‌కు అండగా ఉంటూ... రైతులను సంక్షోభంలో నెట్టేస్తుందన్నారు.
మార్కెట్‌యార్డు సందర్శన
అఖిల పక్ష రైతు సంఘాల నేతలతో కలసి ఎమ్మెల్యే గౌరుచరిత మార్కెట్‌ను సందర్శించి ఉల్లి రైతులు పడుతున్న కష్ట,నష్టాలను పరిశీలించారు. రైతులతో చర్చించి ఉల్లి సాగులో పెట్టిన పెట్టుబడులు, దిగుబడులు ఏ స్థాయిలో వచ్చాయి, మార్కెట్‌లో లభిస్తున్న ధరలను తెలుసుకున్నారు. రైతులు తమ కష్టాలను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. క్వింటాలుకు రూ.100 నుంచి రూ.150 మాత్రమే లభిస్తుందని వాపోయారు. దీంతోఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యే, అఖిల పక్ష రైతుల సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.∙అనంతరం మార్కెట్‌యార్డు చైర్మన్ శమంతకమణి, సెక్రటరీ సత్యనారాయణమూర్తిని పిలిపించి ఉల్లికి రూ. 2 వేలు మద్దతు ధర కల్పించి, కోనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎస్. ఫిరోజ్, సమాచార హక్కు చట్టం నాయకులు ఎన్.కె. జయన్న తదితరులు పాల్గొన్నారు.