
చెరువులో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే
ప్రభుత్వ నిధులతో చేపల పెంపకం
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి మున్సిపాలిటీ: మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్ర«ధాన ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సొసైటీలపై భారం వేయకుండానే ఎమ్మెల్యే నిధులతో చేప పిల్లల పెంపకం చేపట్టిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువులో 1.80 లక్షల చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఫలితంగా చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు చేరిందన్నారు. కుల వృత్తిపైనే ఆధార పడిన వారిని ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో కేసీఆర్ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
గతంలో చెరువులో చేప పిల్లలను వదలాంటే కనీసం ఒక సొసైటీకి రూ.12,500 చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు వారు పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలోని 32 చెరువుల్లో 28.98 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మల్కాపూర్, కల్పగూర్ సొసైటీలకు సొంత భవనాలు నిర్మించేందుకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి అవకాశం ఇచ్చిందని, దీన్ని సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గొంగుల విజయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.