హైకోర్టుకు నివేదించిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీణా-వాణీల ప్రాణాలకు ముప్పుకలగని రీతిలో శస్త్రచికిత్స చేసేందుకు ఎవరైనా డాక్టర్‌ను పిటిషనర్ తీసుకొస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంది. వీణా-వాణీలను వేరుచేయడంలో జరుగుతోన్న జాప్యంపై జోక్యం చేసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, వీణా-వాణీలు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారికి ప్రభుత్వం అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వీణావాణీల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
Published Wed, Oct 19 2016 4:11 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement